10 నిముషాల్లో రూ.100 కోట్ల అమ్మకాలతో మొబైల్ సేల్స్ లో రికార్డ్ !

Tuesday, May 22nd, 2018, 10:47:47 AM IST

ప్రస్తుతం నడుస్తున్న ఈ డిజిటల్ యుగంలో ఒక్క మాటలో చెప్పాలంటే జేబులో పెన్ లేని వారు అయినా కనపడతారేమోకాని, సెల్ లేని వారు మాత్రం దాదాపుగా కనపడరు. సెల్ ఫోన్ ధరలు ఒకవైపు, టెలికాం టారిఫ్ ధరలు మరోవైపు చాలావరకు తగ్గి ప్రతిఒక్కరికి అందుబాటులోకి రావడంతో పొద్దున నిద్ర లేచిన దగ్గరినుండి, రాత్రి పడుకునే వరకు సెల్ మన జీవితంలోనే ఒక ముఖ్య భాగంగా అయిపొయింది. అలానే మార్కెట్ లో కూడా రకరకాల ఫీచర్లతో రోజుకొక మొబైల్ విడుదలవుతోంది. ఇక విషయంలోకి వెళితే ఇప్పటికే అద్భుతమైన ఫీచర్లతో వినియోగదారుల్లో మంచి పేరు పొందిన వన్ ప్లస్ సంస్థ తాజాగా వన్ ప్లస్ 6 మోడల్ ను నిన్న అమెజాన్ ఇండియా ఆన్ లైన్ సేల్ లో విడుదల చేసింది. అద్భుతమైన ఫీచర్లతో అదరగొట్టే ఆ మొబైల్ ఎప్పుడు విడుదలవుతుందా అని ఆసక్తిగా ఎదురు చూసిన వినియోగదారులు ఫ్లాష్ సేల్ ప్రారంభం అవగానే ఒక్కసారిగా కొనుగోళ్లు ప్రారంభించారు.

దీనితో ఏకంగా కనివిని ఎరగని రీతిలో కేవలం 10 నిమిషాల్లో రూ.100కోట్ల మేర మొబైల్స్ అమ్మకాలు సాగినట్లు వన్ ప్లస్ సంస్థ తమ అధికారిక సామజిక మాధ్యమాల్లో వెల్లడించింది. దీనినిబట్టి చూస్తే ప్రపంచ ప్రఖ్యాత యాపిల్ వంటి సంస్థల మొబైల్ ఫోన్ ల తరహాలో వన్ ప్లస్ 6 మొబైల్ ఫోన్ ల అమ్మాకాలు సాగాయని టెక్ నిపుణులు చెపుతున్నారు. ఈ మొబైల్ 6జిబి రామ్, 64జిబి ఇంటర్నల్ మెమరీ వేరియంట్ ధర రూ. 34,999 మరియు 8జిబి రామ్, 128జీబి ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ. 39,999 లతో అమెజాన్ లో అందుబాటులో ఉంది. కాగా తదుపరి ఫ్లాష్ సేల్ ఈనెల 29న మధ్యాహ్నం 12 గంటలకు జరగనుంది..