ఈ నెల 12న నిరాహార దీక్షకు దిగనున్న ప్రధాని మోదీ

Wednesday, April 11th, 2018, 10:33:07 AM IST

పార్లమెంట్ మలిదశ బడ్జెట్ సమావేశాల్ని ప్రతిపక్షాలు అడ్డుకున్నందుకు నిరసనగా ప్రధాని నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా ఈనెల 12న ఒక్కరోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. అదేరోజు ఆయా నియోజకర్గాల్లో పార్టీకి చెందిన పార్లమెంట్ సభ్యుల ఆధ్వర్యంలో దీక్షలు చేపట్టాలని బీజేపీ అధిష్ఠానం నిర్ణయించింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో సద్భావన ఉపవాస్ పేరిట ఒక్కరోజు దీక్ష చేపట్టిన మరుసటిరోజే బీజేపీ నాయకత్వం ఈ నిర్ణయం తీసుకోవడం ఆసక్తికరంగామారింది. ఎన్నికలు జరుగనున్న కర్ణాటకలోని హుబ్లిలో అమిత్‌షా దీక్ష చేపట్టనున్నారు. అయితే ప్రధాని మోదీ మాత్రం ఢిల్లీలో దీక్షలో ఉంటూనే తన రోజువారీ అధికారిక కార్యక్రమాల్లో యథావిధిగా పాల్గొంటారని పార్టీ శ్రేణులు తెలిపాయి. దళితులపై దాడులు, ఏకపక్షంగా పార్లమెంట్‌ను నడుపడంపై కాంగ్రెస్ దీక్షకు దిగగా, విపక్షాలు పార్లమెంట్ సమావేశాల్ని అడ్డుకున్నాయంటూ బీజేపీ నిరసన చేపడుతుండడం గమనార్హం. దీక్ష చేపట్టాలని ప్రధాని మోదీ సూచించారు. పార్లమెంట్‌ను స్తంభింపజేయడంపై బీజేపీ అసంతృప్తితో ఉన్నదన్న సంకేతాలను దేశప్రజలకు చేరవేసేందుకు ఇదో మార్గంగా భావిస్తున్నాం అని ఆ పార్టీ అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు తెలిపారు.
అందరూ కలిసి సమాజాన్ని ముక్కలు చేస్తున్నారు:
-పక్షంపై విరుచుకుపడిన మోదీ సమాజాన్ని ముక్కలు చేస్తున్నారని విపక్ష పార్టీలపై ప్రధాని మోదీ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. పార్లమెంట్ నుంచి వీధుల వరకు ప్రభుత్వ ప్రయత్నాల్లో సమస్యలు సృష్టిస్తున్నారని అన్నారు. బీహార్‌లోని మోతిహరిలో మంగళవారం చంపారన్ సత్యాగ్రహం శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. ఈ వేడుకలకు హాజరైన ప్రధాని రైల్వే, రోడ్లు, పెట్రోలియం, పారిశుద్ధ్యానికి సంబంధించి పలు అభివృద్ధి పనులను సీఎం నితీశ్‌కుమార్‌తో కలిసి ప్రారంభించారు. మాధేపుర రైల్వేఫ్యాక్టరీని జాతికి అంకితంచేసిన ప్రధాని భారత తొలి ఎలక్ట్రిక్ హైస్పీడ్ లోకోమోటివ్ రైలింజిన్‌కు జెండా ఊపారు. అనంతరం జరిగిన సభలో 20వేలమంది స్వచ్ఛభారత్ వలంటీర్లనుద్దేశించి ప్రధాని ప్రసంగించారు. ఓ వైపు కేంద్ర ప్రభుత్వం ప్రజల అభ్యున్నతికి పాటుపడుతుంటే, కొందరు సమాజాన్ని ముక్కలు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. పార్లమెంట్ నుంచి గల్లీల వరకు ప్రభుత్వ ప్రయత్నాలను అడ్డుకోవడమే వారు పనిగా పెట్టుకున్నారు అని ఆయన విమర్శించారు. పార్లమెంట్‌లో విపక్షాల నిరసన, దళిత సంఘాల ఆధ్వర్యంలో భారత్ బంద్ ఆందోళనల నేపథ్యంలో మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు. అవినీతికి, అసాంఘిక శక్తులకు వ్యతిరేకంగా పాలన సాగిస్తున్నారని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్‌ను ప్రధాని ప్రశంసించారు. బీహార్ రూపురేఖలు మారబోతున్నాయని, రాష్ట్రప్రభుత్వం ఇప్పటికే 8లక్షలకు పైగా మరుగుదొడ్లను నిర్మించిందని మోదీ తెలిపారు. చంపారన్ సత్యాగ్రహ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా చంపారన్ హమ్‌సఫర్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ మంగళవారం ప్రారంభించారు. 1383 కిలోమీటర్ల దూరం నడిచే ఈ బైవీక్లీ ఎక్స్‌ప్రెస్ దేశంలోని 33 పార్లమెంటరీ నియోజకవర్గాలకు ప్రయోజనాలు అందించనుంది.

  •  
  •  
  •  
  •  

Comments