వీర సైనికులారా క్షమించండి.. వీళ్ళు మారరు !

Sunday, September 18th, 2016, 05:24:17 PM IST

kashmir-attack
దేశ సరిహద్దులంటే చిన్న చిన్న కవ్వింపు చర్యలు మామూలే. ఇక శత్రు దేశం పక్కన ఉంటే అప్పుడప్పుడు దాడులు కూడా జరుగుతుంటాయి. కానీ ఆ దాడులకు ప్రతిగా సైనిక చర్య లాంటివి ఏవైనా తీసుకోవాలి. ఆలా కాకుండా ఏళ్ల తరబడి అదే పరిస్థితిని ఎదుర్కుంటూ, నష్టపోతుంటే తప్పు మాత్రం ప్రభుత్వాలదే. ఎంతసేపు శాంతి, చర్చలు అంటూ కాశ్మీర్ లో వేర్పాటువాదులకు అలుసైపోయిన నాయకులదే. ఉగ్రవాదులు ఎంతసేపటికి స్థానిక నేతలను, యువతను లొంగదీసుకుని ఎప్పటికప్పుడు తమ కచ్చి తీర్చుకుంటుంటే ప్రభుత్వాలు మాత్రం సైన్యం దాడుల్లో మరణించిన, గాయపడ్డ వారి సంఖ్యను లెక్కబెట్టుకుంటూ కూర్చుంటోంది.

దాని ఫలితమే ఈరోజు ఉదయం కాశ్మీర్ లో జరిగిన ఉగ్రదాడి. తెల్లవారుజామున బారాముల్లా యూరి సెక్టార్‌లో ఆర్మీ బెటాలియన్‌ ప్రధాన కార్యాలయంపై జవానులను లక్ష్యంగా చేసుకొని దాడులు చేశారు ముష్కరులు. ఈ దాడుల్లో ఇప్పటికే 17 మంది జవాన్లు వీరమరణం పొందగా మరో 20మందికి పైగా గాయపడ్డారు. ఇటీవల జరిగిన పఠాన్ కోట దాడికన్నా ఇందులోనే ఎక్కువ ప్రాణ నష్టం జరిగింది. ఉగ్రవాదుల్లో మాత్రం కేవలం 5గురే మరణించారు. అసలు దాడికి ఎంతమంది పాల్పడ్డది ఇంకా తెలీలేదు. ఇక కేంద్ర ప్రభుత్వం అయితే ఎప్పటిలాగే ఒక్కో నాయకుడిని దాడిని ఖండనకు షెడ్యూల్ ప్రకారం మీడియా ముందుకు దింపుతోంది.