పట్టుకుంటే 2.52 కోట్ల రివార్డు..!

Tuesday, September 16th, 2014, 11:33:48 AM IST


మావోయిస్టు పార్టీ సారథి గణపతి అలియాస్‌ ముప్పాళ్ల లక్ష్మణరావు తలకు వెల భారీగా పెరిగింది.మూడు దశాబ్దాలకు పైగా వామపక్ష తీవ్రవాదానికి దళపతిగా కొనసాగుతున్న ఆయన సమాచారం అందిస్తే 2.52 కోట్లు ఇస్తామని నాలుగు రాష్ర్టాలు, ఎన్‌ఐఏ ప్రకటించాయి. ఒక మావోయిస్ట్‌పై రివార్డుగా ప్రకటించడం ఇదే మొదటి సారి.

గణపతి సమాచారం తెలిపితే కోటి రూపాయల చొప్పున నగదు బహుమతి ఇస్తామని మహారాష్ట్ర, చత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు ప్రకటించగా, ఏపీ ప్రభుత్వం 25 లక్షలు, జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) 15 లక్షలు, జార్ఖండ్ ప్రభుత్వం 12 లక్షలు రివార్డులు ప్రకటించాయి. మావోయిస్టు పొలిట్‌బ్యూరో, కేంద్ర కమిటీ సభ్యుల తలలపై కోటి రివార్డును ప్రకటించాయి.

1992లో పీపుల్స్‌వార్‌ పార్టీ పగ్గాలు చేపట్టిన కాలంలో గణపతి తలపై 19 లక్షల వెల ఉండేది. ఆయన స్వస్థలం కరీంనగర్‌ జిల్లా సారాంగపూర్ మండలం బీర్బూమ్‌లో చోటుచేసుకున్న భూస్వాముల హత్యలు, పోలీసుల వధలకు సంబంధించిన కేసుల్లో గణపతి ప్రధాన నిందితుడు. దాంతో రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఆయనపై అంత మొత్తం రివార్డు ప్రకటించింది. 2005లో మావోయిస్టు పార్టీ సారథ్యం తీసుకునే సమయానికి ఆయన తలపై అరకోటి రివార్డు ఉండేది. అల్‌ఖైదా, హిజ్బూల్‌, లష్కరే ఉగ్రవాదులతో సమానంగా.. గణపతిని పోల్చి ఈ మొతాన్ని కేంద్రం ఖరారు చేసింది.