బ్రేకింగ్ న్యూస్ : ఆగని ఆకృత్యాలు…మరో ఇద్దరు బాలికలు బలి

Saturday, April 21st, 2018, 01:46:16 AM IST

కథువా, ఉన్నావ్‌ ఘటనలపై దేశవ్యాప్తంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నా.. మరోవైపు అత్యాచార ఘటనలు పెరిగిపోతూనే ఉన్నాయి. మైనర్లపై జరుగుతున్న వరుస అత్యాచార ఘటనలు తీవ్రంగా కలవరపెడుతున్నాయి. ముక్కుపచ్చలారని పసిమొగ్గలను మృగాళ్లు పాశవికంగా హతమార్చుతున్నారు. తాజాగా అలాంటి ఘటనలు మరో రెండు వెలుగు చూశాయి. ఇటీవల ఉత్తరప్రదేశ్‌లోని ఎటా జిల్లాలో పెళ్లి వేడుకకు హాజరైన ఎనిమిదేళ్ల చిన్నారిని ఓ యువకుడు సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనంలోకి లాక్కెళ్లి అత్యాచారానికి పాల్పడి అనంతరం గొంతు నులిమి హత్య చేసిన సంగతి తెలిసిందే. ఈ ఘటన జరిగిన మూడ్రోజుల్లోనే అదే తరహాలో మరో బాలిక అదే జిల్లాలో బలైంది.

గురువారం రాత్రి ఎటా జిల్లాలో కుటుంబసభ్యులతో కలిసి వివాహ వేడుకకు హాజరైన తొమ్మిదేళ్ల చిన్నారిపై ఓ వ్యక్తి దారుణంగా అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. నిందితుడిని వివాహ కార్యక్రమానికి వంటలు వండేందుకు వచ్చిన బృందంలోని వ్యక్తి పింటుగా గుర్తించారు. రాత్రి 9 గంటల సమయంలో ఇంటి డాబాపై ఉన్న పాపను సమీపంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేసి తర్వాత గొంతు నులిమి చంపాడు. పాప కనిపించకపోవడంతో ఆమె కోసం గాలించడంతో తెల్లవారుజామున 3 గంటలకు చిన్నారి మృతదేహం లభ్యమైంది. పాప తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు నిందితుడిని అరెస్ట్‌ చేశారు.

ఇలాంటిదే మరో ఘటన ఛత్తీస్‌గఢ్‌లో కూడా జరిగింది. అది కూడా పెళ్లికి వేడుకలోనే. రాష్ట్రంలోని కబీర్‌ధామ్‌ జిల్లాలోని ఓ గ్రామంలో వివాహ వేడుకకు హాజరైన పదేళ్ల బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడి చంపేశాడు. బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన అనంతరం రాయితో ఆమె తలపై బలంగా కొట్టడంతో పాప చనిపోయింది. ఈ ఘటనలో 25ఏళ్ల వ్యక్తిని అరెస్ట్‌ చేశారు. నిందితుడిని పెళ్లికుమారుడి స్నేహితుడిగా గుర్తించారు.