ఏపీ మ‌హాసంగ్రామం.. ఎన్ని స‌ర్వేలు వ‌చ్చినా.. చిత‌క్కొట్టేస్తున్న జ‌గ‌న్..!

Thursday, January 31st, 2019, 10:48:19 AM IST

దేశ‌వ్యాప్తంగా మ‌రో మూడు నెలల్లో జ‌రుగ‌నున్న లోక్‌స‌భ సార్వ‌త్రిక ఎన్నిక‌ల నేప‌ధ్యంలో జాతీయ సంస్థ‌లు వ‌రుస‌గా స‌ర్వే ఫ‌లితాల‌ను విడుద‌ల చేస్తున్నారు. ఇప్ప‌టికే విడుద‌ల అయిన సీఎన్ఎక్స్ స‌ర్వే, రిప‌బ్లిక్ టీవీ స‌ర్వే, అండ్ ఇండియా టుడే మూడ్ ఆఫ్ నేష‌న్ స‌ర్వే ఫ‌లితాలు విడుద‌ల అవ‌గా, వాటిలో ఏ పార్టీకి మ్యాజిక్ ఫిగర్ రాకపోవ‌డం గ‌మ‌నార్హం. అయితే ఇప్పుడు తాజాగా విడుద‌ల అయిన టైమ్స్ నౌ- వీఎంఆర్ స‌ర్వే ఫ‌లితాల్లో కూడా ప్ర‌ధాన పార్టీల అంచ‌నాలు పూర్తిగా తారు మారు అయిపోయాయి.

దేశ‌వ్యాప్తంగా మొత్తం 545 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా.. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికి 252 సీట్లు, కాంగ్రెస్ నేతృత్వంలోకి యూపీఏ కూట‌మికి 147 సీట్లు వ‌స్తాయ‌ని, ఇక ఇత‌రుల‌కు 144 సీట్లు వ‌స్తాయ‌ని టైమ్స్ నౌ స‌ర్వే కూడా తేల్చేసింది. దీంతో ఈ స‌ర్వేలో మ్యాజిక్ ఫిగ‌ర్ ఏ పార్టీకి రాక‌పోవ‌డం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ విష‌యానికి వ‌స్తే అక్క‌డ మొత్తం 17 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా, టీఆర్ఎస్‌కు 10 సీట్లు, కాంగ్రెస్‌కు – 5 సీట్లు బీజేపీకి -1, ఇత‌రుల‌కు – 1 సీటు వ‌స్తుంద‌ని ఆ స‌ర్వే అంచనా వేసింది. అయితే ఈ ఫ‌లితాలు టీఆర్ఎస్‌కు అంత సంతృప్తి ఇవ్వ‌క‌పోవ‌చ్చని రాజ‌కీయ పండితుల అభిప్రాయం.

ఇక ఆంధ్ర‌ప్ర‌దేశ్ విష‌యానికి వ‌స్తే.. అక్క‌డ మొత్తం 25 లోక్‌స‌భ స్థానాలు ఉండ‌గా, ప్ర‌స్తుతం అధికారంలో ఉన్న టీడీపీకి ఊహించ‌ని దెబ్బే త‌గిలింది. గ‌త ఎన్నిక‌ల్లో బీజేపీ కాకుండా ఒక్క టీడీపీకే 15 సీట్లు రాగా, ఈ ఎన్నిక‌ల్లో మ‌రీ ఘోరంగా 2 సీట్లు మాత్ర‌మే వ‌స్తాయ‌ని టైమ్స్ నౌ స‌ర్వే స్ప‌ష్టం చేయ‌డంతో, ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో స‌హా టీడీపీ నేత‌లంగా ఒక్క‌సారిగా ఉలిక్కిప‌డుతున్నారు. ఇక ప్ర‌ధాన ప్ర‌తిప‌క్షం వైసీపీకి 23 సీట్లు వ‌స్తాయని టైమ్స్ నౌ స‌ర్వే తేల్చేసింది. ఇప్ప‌టికే విడుద‌ల అయిన స‌ర్వేలు 19 సీట్లు రావొచ్చ‌ని అంచ‌నా వేయ‌గా.. ఇప్పుడు టైమ్స్ నౌ సర్వే ఏకంగా 23 సీట్లు వ‌స్తాయ‌ని చెప్ప‌డంతో వైసీపీలో సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. గ‌త ఎన్నిక‌ల్లో కేవ‌లం రెండు శాతం ఓట్ల‌తో ప్ర‌తిప‌క్షంలో కూర్చున్న వైసీపీ, ఈసారి ఎన్నిక‌ల్లో ఎంత‌మంది క‌లిసి వ‌చ్చినా, సింగిల్‌గా రానున్న వైసీపీ ఓటు బ్యాంక్‌ను ట‌చ్ చేయ‌డం ఎవ‌రి వ‌ల్ల కాద‌ని, ఆ స‌ర్వే అంచ‌నా వేసింది. దీంతో ఏపీలో ఏ స‌ర్వే వ‌చ్చినా జ‌గ‌న్ మాత్రం చిత‌క్కొట్టేస్తున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.