పశ్చిమగోదావరి జిల్లా – పాల‌కొల్లులో బిగ్ ఫైట్.. చంద్ర‌బాబు – చాణ‌క్య‌మా, జ‌గ‌న్- దూకుడా, ప‌వ‌న్ – ప‌వ‌రా..?

Wednesday, October 10th, 2018, 04:24:03 PM IST

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాలోని పాల‌కొల్లులో ద‌శాబ్ధాలుగా కాపు సామాజికవ‌ర్గానికి చెందిన‌వారే ఎన్నిక‌ల్లో పైచేయి సాధించి ప్ర‌జా ప్ర‌తినిధులుగా ఎన్నిక అవుతూ ఉంటున్నారు. అయితే 2009 మాజీ దివంగ‌త ముఖ్య‌మంత్రి ఆధ్వ‌ర్యంలో ఏపీలో కాంగ్రెస్ తిరుగులేకుండా హ‌వా కొన‌సాగిస్తున్న రోజుల్లో వైశ్య సామాజిక వ‌ర్గానికి చెందిన బంగారు ఉషారాణి కాంగ్రెస్ నుండి బ‌రిలోకి దిగి.. కాపుసామాజిక వ‌ర్గానికి చెందిన సినీ న‌టుడు మెగాస్టార్ చిరంజీవి పై సంచ‌ల‌న విజ‌యం సాధించింది.

ఇక పాల‌కొల్లులో ప్ర‌స్తుతం టీడీపీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేగా నిమ్మల రామానాయుడు.. గ‌త నాలుగున్నర ఏళ్లల్లో పాల‌కొల్లు నియోజకవర్గాన్ని చాలా వ‌ర‌కు అభివృద్ధి చేసిన మాట నిజమే కానీ…ఆయ‌న‌ నియోజకవర్గంలో అభివృద్ధితో పాటు అవినీతి కూడా పెద్ద ఎత్తున చేశార‌ని టాక్ ఉంది. అంతే కాకుండా ఈ ఎమ్మెల్యే వ‌న్ మేన్ షో చేస్తూ సొంత పార్టీ నేతల్ని కూడా ఇబ్బందుల‌కి గురి చేశార‌ని తెలుస్తోంది.అయినా అక్క‌డ టీడీపీలో.. రామానాయుడిని మించిన నాయకుడు లేకపోవడంతో.. మ‌రోసారి టీడీపీ త‌రుపున టికెట్ అత‌నికే ల‌భించ‌నుంద‌ని స‌మాచారం.

ఇక‌పోతే వ‌చ్చే ఎన్నిక‌ల్లో జ‌న‌సేన కూడా అన్ని నియోజ‌క వ‌ర్గాల్లో బ‌రిలోకి దిగుతోంది. పాలకొల్లు నియోజకవర్గంలో ఎక్కువ‌గా కాపు సామాజిక వ‌ర్గానికి చెందిన వారి సంఖ్య అధికంగా ఉండ‌డంతో పాటు.. మెగాస్టార్ చిరంజీవి బంధుగుణం, పీకే ఫ్యాన్స్ అధికం. దీంతో పాల‌కొల్లులో జ‌న‌సేన ప్ర‌భావం కూడా ఎక్కువ‌గా ఉండొచ్చు. ప్ర‌స్తుతం మాజీ మంత్రి చేగొండి హరిరామ జోగయ్యతనయుడు.. చేగొండి సూర్యప్రకాశ్‌ జనసేనలో చేరారు. వచ్చే ఎన్నికల్లో ఆయన జనసేన సీటు ఆశిస్తున్నారని స‌మాచారం. మ‌రి పాల‌కొల్లులో జ‌న‌సేన త‌రుపున ఎవ‌రిని బ‌రిలోకి దింపుతారో చూడాలి.

ఇక మ‌రోవైన‌పు ప్ర‌తిప‌క్ష వైసీపీ అభ్యర్థి ఎవరో ఇంకా తేల‌లేదు. . 2014లో టీడీపీ చేతిలో ఓడిన మేకా శేషుబాబును తప్పించి వైసీపీ అధినేత‌ జగన్‌.. నియోజకవర్గ సమన్వయకర్తగా గుణ్ణం నాగబాబును నియమించారు. అయితే వ‌చ్చే ఎన్నిక‌ల్లో వైసీపీ టికెట్ త‌న‌దేన‌ని ప్ర‌చారం చేసుకుంటున్నారు. త‌న‌కు కాకుండా వైసీపీ త‌రుపున టికెట్ ఎవ‌రికి ఇస్తారో చూస్తాన‌ని శేషుబాబు స‌వాల్ విస‌ర‌డంతో వైసీపీ అధిష్టానం డిఫెన్స్‌లో ప‌డింది.

దీంతో అక్క‌డి ప‌రిస్థితుల పై పీకే టీమ్‌తో స‌ర్వే చేయించ‌గా.. మాజీ ఎమ్మెల్యే బాబ్జీ పై అక్క‌డి ప్ర‌జ‌ల్లో పాజిటీవ్ బ‌జ్ ఉంద‌ని దీంతో అత‌న్ని వైసీపీలోకి ఆహ్వానించి సీటు ఇస్తే ఇక్కడ వైసీపీ గెలుపు న‌ల్లేరు పై న‌డ‌కే అని పీకే టీమ్ తేల్చేసింది. అయితే ప్ర‌స్తుతం బీజేపీలో ఉన్న బాబ్జీ ఎటూ తేల్చుకోలేక ఊగిస‌లాడుతున్నార‌ని స‌మాచారం. ఏది ఏమైనా పాల‌కొల్లులో మ‌రోసారి ముక్కోణ‌పు పోటీ త‌ప్ప‌ద‌ని.. ఈసారి టీడీపీ-వైసీపీ-జ‌న‌సేన మ‌ధ్య పోటీ ర‌స‌వ‌త్తంగా ఉండ‌డం ఖాయ‌మ‌ని.. దీంతో పాల‌కొల్లు చంద్ర‌బాబు- చాణ‌క్య‌మా.. జ‌గ‌న్- దూకుడా, లేక ప‌వ‌న్- ప‌వ‌రా ఈ ముగ్గురిలో ఎవ‌రు ఏం చూపిస్తారో చూడాల‌ని రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.