2020 ఒలింపిక్స్ వేదిక టోక్యో

Monday, September 9th, 2013, 01:04:24 PM IST

Tokyo
జపాన్ చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ నిర్వహించే అవకావాన్ని మరోసారి చేచిక్కించుకుంది. 2020 ఒలింపిక్స్ టోక్యోలో జరుగుతాయని ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ కమిటి తెలిపింది. ఓటింగ్ లో 24 ఓట్లతేడాతో ఇస్తాంబుల్ పై స్పష్టమైన ఆదిక్యం సాధించింది. మాడ్రిడ్ నగరానికి కూడా నిరాశే ఎదురైంది. ఒలింపిక్స్ ను రెండో సారి నిర్వహిస్తున్న తొలి ఆసీయా దేశంగా జపాన్ చరిత్ర సృష్టించింది.

విశ్వ క్రీడా సంబరం ఒలింపిక్స్ క్రీడలను రెండో సారి నిర్వహించే అవకాశం జపాన్ రాజధాని నగరం టోక్యోకు దక్కింది. అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) సమావేశంలో 2020 ఒలింపిక్స్ వేదికగా టోక్యోను ప్రకటించారు. ఇందు కోసం జరిగిన ఓటింగ్‌లో టోక్యో 24 ఓట్ల తేడాతో ఇస్తాంబుల్ (టర్కీ)పై స్పష్టమైన ఆధిక్యం సాధించింది. టోక్యోకు మొత్తం 60 ఓట్లు పోల్ కాగా, ఇస్తాంబుల్‌కు 36 మాత్రమే దక్కాయి. పోటీలో నిలిచిన స్పెయిన్ రాజధాని మాడ్రిడ్ తొలి రౌండ్‌లోనే వెనుదిరిగింది. ఈ రౌండ్‌లో జపాన్‌కు 42 ఓట్లు రాగా, ఇస్తాంబుల్, మాడ్రిడ్‌లకు సమానంగా 26 ఓట్లు వచ్చాయి. అయితే టైబ్రేకర్‌లో 49-45 తేడాతో మాడ్రిడ్‌ను ఓడించి ఇస్తాంబుల్ ముందంజ వేసింది. ఒక దశలో ఇస్తాంబుల్ నెగ్గిందనుకొని కొందరు అభిమానులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే అది రెండో రౌండ్‌లోకి మాత్రమే ప్రవేశించిందని తర్వాత తెలిసింది. 1964లో కూడా టోక్యో ఒలింపిక్స్ నిర్వహించింది. రెండో సారి అవకాశం దక్కించుకున్న తొలి ఆసియా నగరం ఇదే కావడం విశేషం.

ఫకుషిమా న్యూక్లియర్ ప్లాంట్ నుంచి వెలువడుతున్న రేడియో ధార్మికత జపాన్ ఒలింపిక్ బిడ్‌కు అడ్డంకిగా మారవచ్చని వినిపించింది. అయితే పరిస్థితి అదుపులో ఉందంటూ, భవిష్యత్తులోనూ ఎలాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తవని జపాన్ బృందం తగిన వివరణ ఇచ్చింది. టోక్యోను ఎంపిక చేయగానే ఆ దేశ ప్రజలు నగర వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకున్నారు. తమ దేశానికి మళ్లీ ఒలింపిక్స్ నిర్వహించే అవకాశం రావడం పట్ల ఆ దేశ ప్రధాని షిన్జో ఆబె ఆనందం వ్యక్తం చేశాడు. ‘ఒలింపిక్ ఉద్యమంలో ఉన్నవారందరికీ నా కృతజ్ఞతలు. మేం ఈ క్రీడలను అద్భుతంగా నిర్వహిస్తాం. రెండేళ్ల క్రితం సునామీ సమయంలో మాకు అండగా నిలిచిన ప్రపంచానికి రుణపడి ఉన్నాం. ఒలింపిక్స్‌తో ఆ అప్పులు కూడా తీర్చేస్తాం’ అని ఆయన వ్యాఖ్యానించారు.

అంచనా వ్యయం 22వేల కోట్లు. ఇందులో సాంకేతికకు 12.3 శాతం. వేదికలు, సౌకర్యాలకు 31.3 శాతం. క్రీడల నిర్వాహణకు 7.3 శాతం. వేడుకలకోసం 2.9 శాతం. ప్రచారం కోసం 3 శాతం డబ్బును ఖర్చు చేయనున్నారు. ఒకటికన్నా ఎక్కువ సార్లు ఒలింపిక్స్ కు అతిద్యమిచ్చిన నగరంలో టోక్యో ఐదోది. లండన్ మూడుసార్లు ఒలింపిక్స్ నిర్వహించింది.

ఒలింపిక్స్ నిర్వహణ కోసం మాడ్రిడ్‌కు అవకాశం దక్కకపోవడం పట్ల స్పెయిన్ స్టార్ టెన్నిస్ క్రీడాకారుడు రాఫెల్ నాదల్ విస్మయం వ్యక్తం చేశాడు. మాడ్రిడ్ బిడ్ తరఫున నాదల్ సుదీర్ఘ కాలంగా ప్రచారం చేస్తున్నాడు. ఇది తనను తీవ్ర నిరాశకు గురి చేసిందని అన్నాడు. ‘స్పెయిన్ రాజధాని పట్ల ఐఓసీ సరిగా వ్యవహరించలేదు. ఒలింపిక్స్ అవకాశం దక్కించుకునేందుకు మా దేశ ప్రజలు ఎన్నో ఏళ్లు శ్రమించారు. మాకా అర్హత ఉందని మేం భావించాం. ప్రచారంలో కూడా మేం ముందున్నాం కాబట్టి తాజా నిర్ణయం తీవ్రంగా నిరాశ పరచింది’ అని నాదల్ వ్యాఖ్యానించాడు.