26 మంది తల్లిదండ్రులకు జైలు శిక్ష ఖరారు..

Saturday, May 5th, 2018, 09:08:23 AM IST

డ్రంక్ అండ్ డ్రైవ్, డేంజరస్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, లైసెన్స్ లేకుండా వాహనాలు నడపడం, మైనర్ల డ్రైవింగ్ విషయాల్లో న్యాయస్థానాలు కూడా సీరియస్‌గా ఉన్నాయి. ఈ ఉల్లంఘనలకు పాల్పడే వారికి జైలు శిక్షలు విధించ డంతోపాటు వారి లైసెన్స్‌లను కూడా సస్పెండ్ చేస్తున్నాయి. అలాగే మైనర్లకు వాహనాలు ఇచ్చే తల్లిదండ్రులపై కూడా సీరియస్‌గానే ఉంటున్నారు. లైసెన్స్ లేకుండా వాహనాలు నడుపొద్దం టూ సూచిస్తున్నా.. కొందరు తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తూనే ఉన్నారు. మైనర్ డ్రైవింగ్‌తో ప్రమాదాలు జరుగుతాయని, పిల్లలు ప్రమాదానికి గురవుతారని, దీంతో వారికి ఎట్టిపరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వొద్దంటూ ట్రాఫిక్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నారు.

పాఠశాలలు, కళాశాలలకు వెళ్లి ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. కొంత మార్పు వచ్చినా పూర్తిస్థాయిలో మాత్రం మార్పు రావడం లేదు. మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ డ్రైవ్‌లో 2016లో 11,000 కేసులు నమోదు కాగా, 2017లో 14,608 కేసులు నమోదయ్యాయి. దీంతో మైనర్లకు వాహనాలు ఇవ్వకుండా వారి తల్లిదండ్రులను కట్టడి చేయాలని భావించిన నగర ట్రాఫిక్ పోలీసులు, వాహనాలు ఇచ్చే వారి తల్లిదండ్రులపై చర్యలు తీసుకోవాలని భావించి ఈ ఏడాది నుంచి న్యాయస్థానాల్లో చార్జిషీట్లు వేయడం ప్రారంభించారు.

ఇప్పటి వరకు మైనర్లకు వాహనాలు ఇచ్చిన 26 మంది తల్లిదండ్రులకు, ఒక మైనర్‌కు ఒకటి, రెండు రోజుల పాటు జైలు శిక్షలు విధిస్తూ న్యాయస్థానాలు తీర్పు చెప్పాయి. మూడు నెలల్లో 273 మంది మైనర్ డ్రైవింగ్ కేసుల్లో పోలీసులు కోర్టుల్లో చార్జీషీటు దాఖలు చేశారు. ఈ పరిణామాలతో మైనర్ డ్రైవింగ్‌లు తగ్గుముఖం పడుతాయని పోలీసులు భావిస్తున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments