షాకింగ్ న్యూస్ : 30% డిస్కౌంట్ తో 35 కోట్లు కుంభకోణం

Sunday, April 22nd, 2018, 09:15:13 AM IST

 

ఓ యువకుడికి వచ్చిన డిస్కౌంట్ అనే ఐడియా రూ.35 కోట్ల స్కాంకు దారితీసింది. కోట్లు విలువైన కార్లను కూడా 30 శాతం డిస్కౌంట్‌కు ఇప్పిస్తానంటూ గొలుసుకట్టు(మల్టీలెవల్ మార్కెటింగ్) తరహాలో తనకున్న సంపన్నవర్గాల స్నేహితుల ద్వారా అవసరమైనవారికి కార్లను ఇప్పిస్తూ ఏడాదిలోనే రూ.30 లక్షల నుంచి రూ.4 కోట్ల విలువైన దాదాపు 200 కార్లను వివిధ షోరూంల నుంచి ఇప్పించాడు. మొదట్లో నమ్మి డబ్బులు ఇచ్చినవారికి కోరుకున్న కార్లు 30 శాతం డిస్కౌంట్‌తో వచ్చేశాయి. ఆ తర్వాత డబ్బులు ఇచ్చినవారు మాత్రం మోసపోయారు. బాధితులు ఆ యువకుడి నుంచి డబ్బులు రికవరీ చేయాలని ప్లాన్ చేస్తుండగానే దేశం విడిచి పారిపోయాడు. బాధితులెవరూ పోలీసులకు ఫిర్యాదు చేయకుండా ఈ విషయంపై గోప్యత ప్రదర్శిస్తున్నారు. నగరంలో ఇలాంటి స్కాం ఒకటి జరిగిందనే విషయం ఆనోటా ఈనోట టాస్క్‌ఫోర్స్ పోలీసులకు తెలియడంతో నిందితుడి కోసం గాలింపు చేపట్టారు.

ఆకాశ్ @ 30 శాతం డిస్కౌంట్

జూబ్లీహిల్స్‌లో పుట్టి పెరిగిన ఆకాశ్ ఆత్మకూర్‌కు సంపన్నవర్గాలకు చెందిన స్నేహితులు చాలామంది ఉన్నారు. గత ఏడాది మార్చిలో ఆకాశ్ ఫైనాన్స్‌లో ఓ ఖరీదైన కారు కొనుగోలు చేశాడు. స్నేహితులతో మాట్లాడుతుండగా, కారు కొనే సమయంలో డిస్కౌంట్ వస్తే బాగుండేదనే చర్చ జరిగింది. ఈ చర్చే ఆకాశ్‌లో డిస్కౌంట్ పేరుతో వ్యాపారం చేయవచ్చనే ఐడియాను తెచ్చింది. చాలా షోరూంలలో తనకు మంచి పరిచయాలున్నాయని, ఏ కారు అయినా కనీసం 30 శాతం డిస్కౌంట్ ఇప్పిస్తానంటూ నమ్మించాడు. ఈ మాటలు నమ్మి న అతని ఇద్దరి స్నేహితులు ముందుగా బీఎండబ్ల్యూ కారు కావాలంటూ కోరగా, 30 శాతం డిస్కౌంట్‌కు ఇప్పించాడు. ఆకాశ్‌కు మంచి పలుకుబడి ఉన్నదని, 30 శాతం డిస్కౌంట్‌కు కారు ఇప్పించాడంటూ ఒకరి నుంచి మరొకరికి స్నేహితులలో ప్రచారం జరిగింది. దీంతో కారు ఇప్పించాలని వచ్చే వారి సంఖ్య క్రమంగా పెరిగింది. నలుగురు కారు కోసం డబ్బులు ఇస్తే.. అందులో ఇద్దరికి 30 శాతం డిస్కౌంట్ ఇప్పించేవాడు. ఆ ఇద్దరు మరో నలుగురిని తీసుకొచ్చే వరకు.. గతంలో మిగిలిపోయిన మరో ఇద్దరికి డిస్కౌంట్‌కు కార్లు ఇప్పించేవాడు. ఇలా వచ్చిన డబ్బును రోటేషన్ చేస్తూ ఏడాదిపాటు నెలకు 10-15 కార్లను కొనుగోలు చేశాడు. తమ బంధువులు భూములు అమ్మారని.. వారి వద్ద లిక్విడ్ క్యాష్ ఉన్నదని అందుకే తమ బంధువులు ఖరీదైన కార్లు కొంటున్నారని కొన్ని షోరూంలలో నమ్మించాడు. మరికొన్ని షోరూంలకు బెంగళూర్‌లోని ఓ కంపెనీ వద్ద బ్లాక్ మనీ ఉన్నదని.. వారు పన్ను ఎక్కువగా కట్టాల్సి వస్తున్నదని.. అందుకే కార్లను కొంటున్నారని నమ్మించాడు. ఇలా ఏడాదిలో రూ.30 లక్షల నుంచి రూ.4 కోట్ల ఖరీదు చేసే సుమారు 200 కార్లను ఇప్పించాడు. ఇందులో సగం మంది 30 శాతం డిస్కౌంట్‌తో కార్లను సొంతం చేసుకున్నారు. ఈ క్రమంలో ఆకాశ్‌కు డబ్బు సర్దుబాటు చేయడంలో ఆలస్యంకావడంతో డబ్బులిచ్చినవారికి చెప్పిన తేదీ కాకుండా వాయిదా వేస్తూ వచ్చాడు. దీంతో అనుమానం వచ్చిన ఒకరిద్దరు డబ్బుల కోసం ఒత్తిడి తెచ్చారు. ఈ నెల 16న కొందరు బాధితులు ఎలాగైన డబ్బులు వసూలు చేయాలని, అతనిని నిర్బంధించేందుకు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న ఆకాశ్ నగరం విడిచి పరారయ్యాడు. నగరంలో ఖరీదైన కార్లను డిస్కౌంట్ ధరలకు ఇప్పిస్తానంటూ భారీగా ఓ వ్యక్తి మోసం చేశాడని సంపన్న వర్గాల్లో చర్చ జరిగింది. ఈ విషయం హైదరాబాద్ టాస్క్‌ఫోర్స్ వెస్ట్, నార్త్‌జోన్ పోలీసుల దృష్టికి వచ్చింది. దీంతో ఆరా తీయడంతో ఈ విషయమంతా వాస్తవమేనని తేలింది. బాధితులు ఒకరిద్దరు టాస్క్‌ఫోర్స్ పోలీసులను ఆశ్రయించడంతో సూత్రధారి కోసం గాలింపు చేపట్టారు.

అంతా గప్‌చుప్..
ఖరీదైన కార్లను 30 శాతం డిస్కౌంట్‌కు సొంతం చేసుకున్నవారు.. డిస్కౌంట్ ధరకు కార్లను కొనేందుకు డబ్బులిచ్చినవారు ఎవరూ ఇప్పుడు నోరు మెదపడం లేదు. ఆకాశ్ చేసిందంతా మల్టీలెవల్ మార్కెటింగ్(గొలుసు కట్టు). మన దేశంలో మల్టీలెవల్ మార్కెటింగ్ నిషేధం. ఆకాశ్ చేతిలో మోసపోయినవారు ఎక్కువగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, సికింద్రాబాద్, బేగంపేటకు చెందినవారు ఉన్నారు. ఏ ఒక్కరూ తాము మోసపోయామని పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం.

షోరూంలలో అంతా బ్లాక్ మనీ!

డీమానిటైజేషన్ తర్వాత ప్రభుత్వం డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహిస్తున్నది. రూ.2 లక్షలలోపు మాత్రమే నగదు లావాదేవీలు చేయాలనే నిబంధన ఉన్నది. లక్షలు, కోట్ల నగదును షోరూంల నిర్వాహకులు ఎలా తీసుకున్నారు? ఆకాశ్ వ్యవహారంలో తక్కువస్థాయిలో బ్యాంకు లావాదేవీలు జరిగాయి. ఆకాశ్ ఇప్పించిన సుమారు 200 కార్లలో 150 నేరుగా డబ్బులు చెల్లించి షోరూంల నుంచి కొనుగోలు చేసినట్టు తెలుస్తున్నది. ఇప్పుడు ఈ విషయంపై ఆదాయపన్నుశాఖ కూడా దృష్టి సారించే అవకాశమున్నది.

  •  
  •  
  •  
  •  

Comments