ఎయిరిండియాకు రూ.59 కోట్ల ఫైన్?

Thursday, May 17th, 2018, 11:01:29 PM IST

ఇప్పటికే ప్రయాణికులపై పలురకాల దాడులు వివాదాలతో కూరుకుపోయిన దేశీయ విమానయాన సంస్థలైన ఇండిగో, ఎయిరిండియా వంటి సంస్థలు ఈ మధ్య తెగ వార్తల్లో నిలుస్తున్నాయి. అయితే తాజాగా ప్రయాణీకులను ఆలస్యంగా చేరవేసినందుకు ఎయిరిండియా ఏకంగా రూ.59 కోట్ల ఫైన్ కట్టనున్నట్లు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే ఇటీవల మొన్న మే 9న న్యూఢిల్లీ నుండి చికాగో వెళ్ళవలసిన ఎయిరిండియా విమానం మొత్తంగా షెడ్యూల్ ప్రకారం 16గంటల్లో అక్కడకు చేరుకోవాల్సి వుంది. అయితే ఆరోజు వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల విమానాన్ని చికాగో దగ్గర్లోని మిల్ వాకీ అనే ప్రాంతంలో ల్యాండ్ చేయడం జరిగింది. అయితే అప్పటికే అందులోని ప్రయాణీకులు 16 గంటలు ప్రయాణించారు.

మరోవైపు డీజీసీఏ నిబంధనల ప్రకారం విమాన సిబ్బంది పని గంటలు పూర్తి అవడం అందునా ఆరోజు కేవలం ఒక్కచోట మాత్రమే విమాన ల్యాండింగ్ కు అవకాశం ఉండడంతో వేరే అవకాశం లేక ఎయిరిండియా సంస్థవారు వారి స్థానే వేరొక షిఫ్ట్ మారనున్న సిబ్బందిని మిల్ వాకీ ప్రాంతానికి రోడ్ మార్గంలో తరలించారు. తాజా సిబ్బంది చేరుకోగానే విమానం చికాగో చేరుకుంది. నిజానికి మిల్ వాకీ నుండి చికాగోకు 20 నిమిషాలు మాత్రమే టైం పడుతుంది. ఈ సిబ్బంది షిఫ్ట్ ల మార్పు ఆలస్యం వల్ల చికాగో చేరేసరికి అదనంగా మరొక 6 గంటలు పట్టింది. ఆ ఆరుగుంటలు ప్రయాణీకులు విమానంలోనే వున్నారు.

ఇక్కడే ఎయిరిండియా చిక్కుల్లో పడింది. అమెరికా నిబంధలు ప్రకారం ఎక్కడైనా విమానంలో ప్రయాణీకులు ఉండగానే మధ్యలో ఎక్కడైనా 4 గంటల కంటే ఎక్కువ సేపు నిలిపి ఉంచితే ఆ విమానయాన సంస్థ ప్రయాణీకులకు కొంత మొత్తం పరిహారంగా చెల్లించలేనిది అక్కడి నిబంధన. దీని ప్రకారం విమానంలోని 323 మంది ప్రయాణీకులకు ఒక్కొక్కరికి 27,500 డాలర్ల చప్పున మొత్తం కలిపి అందరికి 8.8 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుందాని అక్కడి అధికారులు చెపుతున్నారు. కాగా విమానంలో మొత్తం 41మంది వీల్ చైర్ ప్రయాణీకులు, ఇద్దరు చిన్నారులు, ఒకరు ఆటిజం వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి వున్నారు. అయితే డీజీసీఏ నిబంధనలలో కొన్ని మార్పులు కోరుతూ ఎయిర్ ఇండియా, ఫెడరేషన్ అఫ్ ఇండియన్ ఎయిర్ లైన్స్ ఢిల్లీ హై కోర్ట్ ను ఆశ్రయించాయి. మరి ప్రయాణీకులకు జరిగిన అసౌకర్యానికి ఎయిర్ఇండియా నిజంగానే ఆ మొత్తం ఫైన్ రూపంలో చెల్లించవలసి ఉంటుందో లేదో తెలియాలంటే కోర్ట్ తీర్పు వచ్చే వరకు ఆగవలసిందే……

  •  
  •  
  •  
  •  

Comments