ఐదు ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులు.. అంతా ఉత్తుత్తేనా?

Saturday, October 20th, 2018, 12:27:03 AM IST

గ‌డిచిన నాలుగేళ్ల‌లో చంద్ర‌బాబు ప్ర‌భుత్వం చేసిన హ‌డావుడి చూస్తే ఏదో చేసేసింద‌నే భ్ర‌మ త‌ప్ప‌, ప్ర‌జ‌ల‌కు చేసిందేం లేద‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్న సంగ‌తి తెలిసిందే. రాజ‌ధాని పేరుతో రియ‌ల్ వెంచ‌ర్ల‌కు తెర‌తీసి ధ‌నార్జ‌న సాగించే ప్ర‌ణాళిక‌లు, న‌గ‌రాల్లో భూదోపిడీ త‌ప్ప ఏపీలో అభివృద్ధి అన్న‌దే క‌నిపించ‌లేదు. దీనిపై ఇప్ప‌టికే ప్ర‌తిప‌క్షాలన్నీ విరుచుకుప‌డుతూనే ఉన్నాయి. అమ‌రావ‌తి, గుంటూరు, విజ‌య‌వాడ‌, వైజాగ్, తిరుప‌తి వంటి ఖ‌రీదైన న‌గ‌రాల్లో భూదోపిడీకి తెర‌లేపి చిన‌బాబు, పెద‌బాబు క‌లిసి బినామీల పేరున దోచి పెట్టుకున్నార‌న్న విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ప్ర‌స్తుతం జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌తో పాటు, జ‌గ‌న్, భాజ‌పా నాయ‌కులు చేస్తున్న ఆరోప‌ణ‌లు ప‌రిశీలిస్తే .. అధికారాన్ని అడ్డు పెట్టుకుని ర‌క‌ర‌కాలుగా దోపిడీ సాగించార‌ని అర్థ‌మ‌వుతోంది. ఐటీ హ‌బ్, ప‌రిశ్ర‌మ‌లు, కంపెనీలు, సెజ్‌ల‌ పేరుతో భారీగా దోపిడీ సాగించార‌ని, క్విడ్ ప్రో కోని ఎంక‌రేజ్ చేశార‌న్న సంగ‌తి అర్థ‌మ‌వుతోంది.

ముఖ్యంగా విశాఖ న‌గ‌రంలో ఏపీ ప్ర‌భుత్వం ఎంతో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా పారిశ్రామిక‌వేత్త‌ల స‌ద‌స్సులు నిర్వ‌హించింది. దేశ‌విదేశాల నుంచి పారిశ్రామిక వేత్త‌ల్ని, ఎన్నారైల‌ను ఆహ్వానించి ఏపీలో భారీగా పెట్టుబ‌డులు పెట్టాల్సిందిగా కోరారు. ఈ స‌ద‌స్సుల్లో ర‌క‌ర‌కాల ఒప్పందాలు సాగాయి. ప్ర‌తిసారీ ల‌క్ష‌ల కోట్ల మేర ప్రాజెక్టులు ఓకే అయిపోయాయ‌ని, ఇక ఏపీ మ‌రో సింగ‌పూర్‌గానో, లేక లాస్ ఏంజెల్స్, న్యూయార్క్ త‌ర‌హాలో ఎదిగేసింద‌న్న భ్ర‌మ‌ల్ని ప్ర‌జ‌ల్లో క‌ల్పించారు చంద్ర‌బాబు. 2016 స‌ద‌స్సులో ల‌క్ష కోట్ల ప్రాజెక్టులు, 2017 స‌ద‌స్సులో 4ల‌క్ష‌ల కోట్ల ప్రాజెక్టులకు ఒప్పందాలు పూర్త‌య్యాయ‌ని ప్ర‌క‌టించారు. ప్ర‌క‌ట‌న‌లు ఘ‌నం.. ప‌నులు శూన్యం! అనుకోవాలో లేక‌ రాజుగారు త‌ల‌చుకుంటే దెబ్బ‌ల‌కు కొద‌వేం లేదు అని భావించాలో కానీ అస‌లు ఈ ఒప్పందాల‌న్నీ ఏమైపోయిన‌ట్టు? ప‌నులు ఎక్క‌డ మొద‌లైన‌ట్టు?

ఇంత‌వ‌ర‌కూ వైజాగ్ లో కానీ, తిరుప‌తిలో కానీ భారీగా ఐటీ కంపెనీలు వ‌చ్చిన‌ట్టు క‌నిపించ‌నేలేదు. ఇక ప‌రిశ్ర‌మ‌లు ఎక్క‌డ అభివృద్ధి చేశారో క్లారిటీనే లేదు. మ‌రోవైపు అమ‌రావ‌తిలో భారీగా భూములిచ్చిన రైతుల స‌న్నివేశ‌మేంటో అర్థం కాని ఫ‌జిల్‌లా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. దీంతో పాటు ఇటీవ‌లే విశాఖ న‌గ‌రంలో ఫిలింఇండ‌స్ట్రీని స్థాపిస్తున్నామ‌ని, స్టూడియోలు నిర్మిస్తామ‌ని ప్ర‌క‌టించినా చంద్ర‌బాబు మాట‌ను ఉత్త‌రాంధ్ర ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. వైజాగ్‌లో సినీప‌రిశ్ర‌మ‌ను స్థాపిస్తే ఉపాధి పెరుగుతుంద‌ని భావించిన కోటానుకోట్ల ఉత్తరాంధ్ర ప్ర‌జ‌ల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం మ‌భ్య పెట్టేందుకే ఈ ప్ర‌క‌ట‌న‌లు చేస్తోంద‌న్న సందేహం క‌లిగింది. ప్ర‌స్తుతం ఉత్త‌రాంధ్ర నాలుగు జిల్లాల్లో ఇదే విష‌య‌మై యూత్‌లో ముచ్చ‌టా సాగుతోంది. మ‌రోవైపు వాతావ‌ర‌ణ కాలుష్యానికి కార‌క‌మ‌య్యే అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన ప‌రిశ్ర‌మ‌ల్ని కోస్ట‌ల్‌లోని ప‌చ్చ‌ని పంట‌పొలాల్లో ఏర్పాటు చేస్తూ ప్ర‌జా వ్య‌తిరేక ప‌నుల‌కు చంద్ర‌బాబు ప్ర‌భుత్వం పూనుకుంది. ఆ క్ర‌మంలోనే ఉత్త‌రాంధ్ర తీరం వెంబ‌డి బోలెడ‌న్ని గొడ‌వ‌లు జ‌రిగాయి. ఇవ‌న్నీ చంద్ర‌బాబు ప్ర‌భుత్వానికి మునుముందు స‌వాళ్లుగా మార‌నున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తేదేపా ప్ర‌భుత్వానికి ఓట్ల‌తోనే జ‌నం స‌మాధానం చెప్ప‌డం ఖాయమ‌న్న మాటా వినిపిస్తోంది.

  •  
  •  
  •  
  •  

Comments