700ల మంది భారత జవాన్ల ఆత్మహత్య…

Friday, March 23rd, 2018, 11:51:15 AM IST

భారతమాత సైతం భరించలేని అక్షర సత్యం, భూ ప్రపంచం కూడా నమ్మలేని నిజం ఇది. కేంద్ర బలగాలకు చెందిన 700 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. గత ఆరేళ్లలో ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగింది. ఈ విషయాన్ని కేంద్ర హోంశాఖ గురువారం పార్లమెంటరీ ప్యానెల్‌కు వెల్లడించింది. నిస్సత్తువ, ఒంటరితనం, ఇంట్లో కారణాల వల్ల ఈ ఆత్మహత్యలు జరిగినట్లు కేంద్ర హోంశాఖ తన రిపోర్ట్‌లో వెల్లడించింది. కేంద్ర బలగాల్లో వాలెంటరీ రిటైర్మెంట్ సుమారుగా ప్రతి ఏడాదికి 9 వేలు ఉన్నట్లు కూడా హోంశాఖ స్పష్టం చేసింది. కేంద్ర బలగాలైన బీఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎప్, ఐటీబీపీ, సీఐఎస్‌ఎఫ్, ఎస్‌ఎస్‌బీ, అస్సాం రైఫిల్స్ దళాలకు చెందిన జవాన్లు దారుణ ఆత్మహత్యలకు పాల్పడ్డారు. సీఆర్‌పీఎఫ్‌లో 2012 నుంచి 189 మంది జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. మరో 175 మంది వివిధ ఆపరేషన్లలో ప్రాణాలు కోల్పోయారు.

2001 నుంచి బీఎస్‌ఎఫ్‌లో 529 సుసైడ్ చేసుకున్నారు. మరో 491 మంది దాడుల్లో మృతిచెందారు. ఇండో టిబెటన్ బోర్డర్ పోలిస్‌లోనూ 2006 నుంచి 62 మంది ఆత్మహతకు పాల్పడ్డారు. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూర్టీ ఫోర్స్‌లో 63 మంది సుసైడ్ చేసుకున్నారు. 2013 నుంచి శశస్త్ర సీమా బల్‌లో 32 మంది ఆత్మహత్య చేసుకున్నారు. 2014 నుంచి అస్సాం రైఫిల్స్‌లో 27 మంది సుసైడ్ చేసుకున్నారు. ఇలా భారత పుణ్య భూమికోసం ఒక వైపు యుద్ధభూమిలో ప్రాణాలర్పిస్తుంటే మరోవైపు ఆవేదనతో, అనేక సమస్యలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఏదేమైనా భారత జవాన్లకు తగిన న్యాయం చేకూరేలా చర్యలు తీస్కోవాలని పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టబడింది. ఇక పార్లమెంటు ఈ అంశానికి సంబంధించి ఎలాంటి నిర్ణయం తీస్కుంటుందని వేచి చూడాలి.