షాక్‌ : 92% మంది రూ.10వేల లోపు జీతంతో?!!

Sunday, October 7th, 2018, 11:00:50 PM IST

దేశంలో నిరుద్యోగం ఉరుమురుముతోంది. దేశం గొప్ప‌గా వెలిగిపోతోంద‌ని చెప్పేవాళ్ల మాట‌ల్ని న‌మ్మొద్ద‌ని నిరుద్యోగము హెచ్చ‌రిస్తోంది. ఒక‌టి నుంచి 10శాతం లోపు అనుకుంటే ఏమో అనుకోవ‌చ్చు… నిరుద్యోగం అన్న‌ది ఇటీవల 5శాతం అమాంతం పెరిగింద‌ని ప్ర‌ఖ్యాత ఢిల్లీలోని అజీమ్ ప్రేమ్ జీ యూనివర్సిటీ- సెంటర్ ఫర్ సస్టెయినబుల్ ఎంప్లాయ్ మెంట్ నివేదిక షాకిచ్చే నిజాన్ని క‌ళ్ల ముందుకు తెచ్చింది. దేశంలో నిరుద్యోగ సమస్య ఎలా ఉంది? యువతకు ఉద్యోగాలు ఎలా వస్తున్నాయి? దేశంలో జీతాలు ఎలా ఉన్నాయన్న అంశంపై సాగించిన స‌ర్వేలో క‌ళ్లు భైర్లు క‌మ్మే నిజాలు నిగ్గు తేలాయి. గడిచిన 20 ఏళ్లలో దేశంలో నిరుద్యోగుల సంఖ్య పెరుగింది, నాలుగున్నరేళ్ల కాలంలో మోడీ పాలనలోనూ నిరుద్యోగం అలా పెరుగుతూనే ఉంద‌ని తేల్చింది.

బాగా చ‌దువుకున్న‌ యువతలో దాదాపు 16 శాతం మంది నిరుద్యోగ సమస్యను ఎదుర్కొంటున్నారు. నిరుద్యోగ సమస్యతో పాటు చేతి నిండా పని లేకపోవటం.. ప‌నికి త‌గ్గ వేత‌నం లేక‌పోవ‌డం అన్న స‌మ‌స్య యువ‌త‌ను నాశ‌నం వైపు తీసుకెళుతోంది. దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిలో ఎక్కువగా నిరుద్యోగం ఉంది. అయితే.. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. ఛత్తీస్ గఢ్.. గుజరాత్.. కర్ణాటక రాష్ట్రాల్లో నిరుద్యోగం మిగిలిన రాష్ట్రాల స్థాయిలో పెరగలేని ఈ స‌ర్వే తేల్చింది. దేశంలో 92 శాతం మహిళలు.. 82 శాతం పురుషులు అతి త‌క్కువ వేత‌నం పొందుతున్నారు. వీరంతా నెలకు రూ.10 వేల కంటే తక్కువ జీతానికే బతికేస్తున్నార‌న్న స‌ర్వే క‌ళ్లు భైర్లు క‌మ్మేలా చేస్తోంది. దేశ వ్యాప్తంగా 67 శాతం కుటుంబాల నెలసరి ఆదాయం రూ.10వేలు. దేశం గొప్ప‌గా వెలిగిపోవ‌డం అంటే ఇదేన‌న్న‌మాట‌!!