కట్నం కోసం భార్యను సీలింగ్ ఫ్యాన్ కు కట్టేసి…?

Monday, April 16th, 2018, 05:58:04 PM IST

కట్నం కోసం ఓ కిరాతకుడు కట్టుకున్న భార్యను చిత్రహింసలు పెట్టి నరకం చూపించాడు. భార్య అన్న విషయం పక్కన పెడితే సాటి మనిషి అన్న సానుభూతి కూడా చూపించకుండా ఆమె చేతులను సీలింగ్‌ ఫ్యాన్‌కు కట్టేసి బెల్టుతో విచక్షణా రహితంగా చితక కొట్టాడు. అంతటితో వూరుకోకుండా ఈ దారుణాన్ని వీడియో తీసి తన అత్తింటివారికి పంపాడు. తాను అడిగిన కట్నం ఇవ్వకపోతే మరింత హింసిస్తానని బెదిరించాడు. అలాగే కట్టేసి ఉంచిన ఫ్యాన్ ఆన్ చేసి గిరగిరా తిప్పుతా అని బెదిరించాడు. కడుపు తరుక్కుపోయే ఈ సంఘటన యూపీలోని షాజహాన్‌పూర్‌లో చోటుచేసుకుంది.

చిత్రవధకు గురైన బాధితురాలు చెప్పిన సమాచారం ప్రకారం.. పుట్టింటికి వెళ్లి రూ. 50వేలు కట్నం తీసుకురమ్మని ఆమెను భర్త పీడించాడు. బాధితురాలు అందుకు ఒప్పుకోకపోవడంతో ఆమెను బెల్టుతో నాలుగు గంటలపాటు విచక్షణారహితంగా కొట్టాడు. దెబ్బలకు తాళలేక బాధితురాలు స్పృహ కోల్పోయింది. మెలకువ వచ్చేసరికి తన రెండు చేతులను చున్నితో సీలింగ్‌ ఫాన్‌కు కట్టేశాడని బాధితురాలు తన బాధను మీడియాతో పంచుకుంది. తాను చదువుకోకపోవడం వల్లనే ఈ దుస్థితి ఎదుర్కొవాల్సి వచ్చిందని, తన జీవితం నాశనమైపోయిందని ఆమె కన్నీరు మున్నిరయిపోయింది.

ఈ విషయం గురించి షాజహాన్‌పూర్‌ సర్కిల్‌ ఆఫీసర్‌ సుమిత్‌ శుక్లా మాట్లాడుతూ.. బాధితురాలి భర్త ఏ మాత్రం కనికరం లేకుండా తన భర్యను కొడుతున్న వీడియోను తాము చూశామన్నారు. వీడియోను పరిశీలించిన తర్వాత బాధితురాలి భర్తతో పాటు అతని కుటుంబ సభ్యులు మరో నలుగురి మీద వరకట్న నిషేధం చట్టం కింద కేసు నమోదు చేసినట్టు తెలిపారు. పరారీలో ఉన్న నిందితులను పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.