హైదరాబాద్ లో మరో భారీ ‘సర్వే’

Tuesday, October 14th, 2014, 02:32:17 AM IST

survya
గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ మరో సర్వేకు సన్నద్దం అవుతోంది. జీహెచ్ఎంసి పరిధిలో తగ్గుతున్న ఓటింగ్ శాతాన్ని పెంచుకునేందుకు దేశంలోనే తొలిసారిగా ప్రయోగాత్మక సర్వేకు సిద్ధమైంది. ఓటర్ కార్డుకు.. ఆధార్ కార్డును అనుసందానం చేస్తూ ఈ సర్వే నిర్వహించనుంది. జిహెచ్ఎంసికి త్వరలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఈ సర్వే సర్వత్రా చర్చనీయాంశంగా మారింది..

జీహెచ్ఎంసి పరిధిలోని 24 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఎప్పటికప్పుడు ఓట్ల నమోదు శాతం తగ్గుతూ వస్తోంది. ఓట్ల నమోదును పెంచేందుకు ప్రభుత్వ యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాలేవీ ఫలించడం లేదు. దీనికి కారణం.. ఎన్నికల సమయంలో నగరంలో నివసించే వారు సొంత గ్రామాల్లో ఓటు వేసేందుకు తరలి వెళ్ళిపోతున్నారు. భాగ్యనగరంలో 81లక్షల మంది ఓటర్లు ఉన్నప్పటికీ ..వీరిలో ఓటు వేసే వారి సంఖ్య కేవలం 35శాతం మాత్రమే. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 80శాతం వరకూ ఓటింగ్ నమోదవుతుండగా..హైదరాబాద్ లో మాత్రం ఇది తగ్గుతుండటంపై అధికార యంత్రాంగం మల్లగుల్లాలు పడుతోంది. కనీసం జిహెచ్ఎంసి ఎన్నికలలోనైనా ఓటింగ్ శాతాన్ని పెంచాలని నిర్ణయించిన టీ సర్కారు… బోగస్ ఓట్లను ఏరివేయాలని నిశ్చయించుకుంది. ఇందులో భాగంగా సర్వే చేయాలనుకుంటోంది.

ప్రతీ సంవత్సరం గ్రేటర్ పరిధిలో డోర్ టూ డోర్ సర్వే ద్వారా ఓటర్ల సంఖ్య తెలుసుకుంటున్నప్పటికీ పరిస్థితిలో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. అసలు గ్రేటర్ పరిధిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారు…వారిలో బోగస్ ఓట్లు కలిగిన వారెంతమంది అనే అంశంపై దృష్టి సారించిన జిహెచ్ఎంసి…ఈ మేరకు కొన్ని ప్రత్యామ్నాయాలను ఎన్నికల కమిషన్ కు సూచించింది. వీటిని పరిశీలించిన ఎన్నికల కమిషనర్ నగరంలో నివసించే వారి ఆధార్ కార్డుకు ఓటర్ కార్డుకు అనుసందానం చేసేందుకు అనుమతించింది. డూప్లికేట్, షిఫ్టెడ్, డెడ్ ఓటర్స్ సమాచారాన్ని కచ్చితంగా తెలుసుకునేందుకు ఓటర్ కార్డు-ఆధార్ కార్డు అనుసందాన ప్రక్రియ ఉపయోగపడుతుందని సిఇఓ భన్వర్ లాల్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లో 95 శాతం ప్రజలకు ఆధార్ కార్డులు ఉన్నాయని, ఎవరికైనా లేకపోతే వారు వెంటనే శాశ్వత ఆధార్ నమోదు కేంద్రాల వద్ద తమ పేర్లను నమోదు చేయించుకోవాలని సూచించారు. ఈ సర్వే పబ్లిక్ డ్రాఫ్ట్ రోల్ నవంబర్ 1న అందుతుందని, 23 నాటికి పూర్తి అవుతుందన్నారు.

ఇప్పటికే పలు రకాల సర్వేలతో సతమతమవుతున్న గ్రేటర్ హైదరాబాద్ ప్రజలకు.. ఓటర్ కార్డుకు-ఆదార్ కార్డు అనుసందాన ప్రక్రియ ఎదురుకానుంది. సర్వేలతో ఎలాంటి ఫలితాలు వచ్చాయనే అంశాన్ని పక్కన పెడితే ఈ ఓటర్ కార్డు సర్వేకు ఎంతమంది సహకరిస్తారో వేచి చూడాల్సిందే…