వీడియో : ఇలా అయితే ఫోన్ అస్సలు పగలదు!

Saturday, June 30th, 2018, 10:50:21 AM IST

ప్రస్తుతం రోజుల్లో మీడియం ధరలకే స్మార్ట్ ఫోన్లు వచ్చేశాయి. అయితే మొబైల్ చేతిలో ఉన్నంత వరకు బాగానే ఉంటుంది. కానీ పొరపాటున జారిందో పది దిక్కుల్లో ముక్కలై కనిపిస్తుంది. ఎంత నాణ్యతతో కూడిన స్మార్ట్ ఫోన్స్ అయినప్పటికీ నేలను తాకితే నామ రూపాలు లేకుండా పోతున్నాయి. చాలా కాలంగా ఇలాంటి ఇబ్బందులు ఫోన్ లవర్స్ ని బాధకు గురి చేస్తున్నాయి. అయితే ఇక నుంచి అలాంటి దిగులు అవసరం లేదు.

ఒక యువకుడు మంచి ఉపాయం ఆలోచించాడు. మనుషులకు ప్రమాదం జరిగితే వాహనాల్లో ఎయిర్ బ్యాగ్ కాపాడినట్లు ఫోన్లకు కూడా అదే తరహాలో ఎయిర్ బ్యాగ్ లాగా ఒక కేస్ కవచం కానుంది. జర్మనీలోని ఆలేన్ విశ్వవిద్యాలయం విద్యార్థి ఫిలిప్‌ ఫ్రెంజెల్‌ పలు మార్లు తన ఐ ఫోన్ ను పొరపాటున పగలగొట్టుకున్నాడు. అయితే అతను ఎలాగైనా మంచి ఉపాయం కనిపెట్టాలని రెండున్నరేళ్లుగా తన స్నేహితులతో కష్టపడ్డాడు.

ఫైనల్ గా ఆడ్‌కేస్‌ (ADCASE) అనే ఒక సెన్సార్ ఉన్న పరికరాన్ని కనిపెట్టాడు. దానికి అతనికి అవార్డు కూడా దక్కింది. ఫోన్ కిందపడుతుంది అనగానే సెన్సార్ వల్ల ఫోన్ కు నలు దిక్కులా కవచాలు వచ్చేస్తాయి. వాటి రక్షణతో ఫోన్ తో భూమి ఏ మాత్రం తాకాదు. ప్రస్తుతం అందుకు సంబందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.