బీజేపీలో అద్వానీ శకం ముగిసినట్టేనా..?

Monday, June 10th, 2013, 08:47:31 AM IST


భారతీయ జనతా పార్టీని రెండు సీట్ల స్థాయి నుంచి రెండు వందల స్థాయికి చేర్చిన ఘనత లాల్ కృష్ణ అద్వానీది. ఇకపై ఆయన పాత్రపై భరోసా తగ్గిపోయింది. మూడు దశాబ్దాల బీజేపీ చరిత్రలో మునుపెన్నడూ లేని పరిణామాలు సంభవించబోతున్నాయి. మోడీ, రాజ్ నాథ్ లాంటి నవశకం ప్రాభవంతో అద్వానీ సలహాలు, సూచనలకే పరిమితం అయ్యే పరిస్థితి నెలకొంది. ఒక రకంగా బీజేపీలో అద్వానీ శకం అంతమైనట్లే అంటున్నారు. మోడీకి ఆర్ఎస్ఎస్ గట్టిగా మద్దతు పలుకుతోంది. అద్వానీ లేకపోయినప్పటికీ ఆర్ఎస్ఎస్ డిమాండ్ వల్లనే మోడిని ప్రకటించినట్లుగా చెబుతున్నారు. మోడీకి బాధ్యతలు అప్పగించడం పట్ల అద్వానీతో పాటు ఆయన వర్గం కినుక వహించింది.

భారతదేశ రాజకీయాల్లో తనకంటూ సుస్థిర స్థానం సంపాదించుకున్న అగ్రనేత అద్వానీకి అదృష్టం ఎప్పుడూ కలిసిరాలేదు. తన రథయాత్ర ద్వారా అధికారంలోకి తెచ్చి ఘనత అద్వానీకే దక్కుతుంది. ఇంత చేసినా ప్రధాని పదవి మాత్రం ఆయనను వరించలేదు. ఆ పదవిని సీనియర్ నేత అటల్‌బిహారీ వాజ్‌పేయి తన్నుకుపోయారు.

రథయాత్ర బీజేపీకి వరమైతే.. వ్యక్తిగతంగా అద్వానీ కరడుగట్టిన హిందుత్వ వాదిగా మార్చింది. ఈ కారణంగానే ఆయన అత్యున్నత పదవికి దూరం అయ్యాడనే విమర్శలు వచ్చాయి. ఆ తర్వాత హిందుత్వ ముద్ర చెరిపేసుకోవడానికి అద్వానీ ఎన్నోతంటాలు పడ్డారు. రామమందిర వివాదాన్ని తెరపైకి తెవడంతో హిందుత్వవాదం మరింత ముదిరింది. మహమ్మద్‌ అలీ జిన్నాను సెక్యులరిస్టుగా పొగడడంతో సంఘ్‌ పరివార్ ఆగ్రహం చవి చూడాల్సి వచ్చింది. ఏకంగా పార్టీ అధ్యక్ష పదవికే ఎసరు పెట్టింది. ఆ తరువాత లోక్‌సభలో ప్రతిపక్ష నేత గా కూడా ఆయన ఎంపిక కాలేదు. దీంతో అద్వానీని సమర్థించేవారు లేక ఆయన ఒంటరైపోతున్నారు. ఇక బిజెపిలో ఆయన శకం ముగిసినట్లేనని రాజకీయనేతలు విశ్లేషిస్తున్నారు.