అద్వానీ వర్సెస్ మోడీ: బీజేపీలో వేడి

Sunday, June 9th, 2013, 11:00:06 AM IST

బీజేపీ అగ్రనేతలు ఎల్‌కె అద్వానీ, నరేంద్ర మోడీ ల విషయం ఇప్పుడు చర్చనీయాంశం అవుతోంది. వచ్చే ఎన్నికల్లో బీజేపీ ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోడీని వ్యతిరేకిస్తున్నారంటూ అద్వానీకి స్వంత పార్టీ కార్యకర్తల నుంచి అనూహ్య నిరసన ఎదురైంది. గోవాలో జరుగుతున్న పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు అద్వానీ డుమ్మాకొట్టడం ఢిల్లీలోని మోడీ మద్దతుదారులకు ఆగ్రహం తెప్పించింది. దీంతో, వారు పెద్ద సంఖ్యలో అద్వానీ ఇంటి ముందు నిరసన ప్రదర్శన నిర్వహించారు. మోడీకి మద్దతివ్వాలంటూ వారు డిమాండ్ చేశారు.

85 ఏళ్ళ అద్వానీ.. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు గైర్హాజరవడం ఇదే తొలిసారి. అనారోగ్యం అంటూ అద్వానీ జాతీయ కార్యవర్గ సమావేశానికి డుమ్మా కొట్టారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ ప్రచార సారథిగా మోడీని ఎంపిక చేయడం ఇష్టంలేకే ఆయన గోవా సమావేశాలకు దూరంగా ఉన్నాడని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు తాను అద్వానీకి ఫోన్ చేశానని, నిజంగానే అద్వానీ ఆరోగ్యం బాగా లేదని పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ చెప్పారు. బిజెపి అధికార ప్రతినిధి షాహనవాజ్ హుస్సేన్, వెంకయ్యనాయుడు కూడా దాదాపు అదే మాట అన్నారు. కాంగ్రెసుకు తమ పార్టీ భిన్నమైందని, తమ పార్టీలో శిబిరాలు ఉండవని జాతీయ కార్యవర్గ సభ్యుడు నళిన్ కోహ్లీ అన్నారు. అద్వానీ శిబిరం డుమ్మా అద్వానీ మద్దతుదారులు వరుణ్ గాంధీ, జస్వంత్ సింగ్, ఉమా భారతి సమావేశానికి డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అవుతోంది.