వారి మిత్రులనే చంపుకున్న ఉగ్రవాదులు

Tuesday, October 24th, 2017, 09:58:13 AM IST

ఒక్కసారి ఉగ్రవాదిగా మారితే వారి మధ్య ఏ బంధాలకు విలువలు ఉండవు. వారి క్రూరత్వం ఎలా ఉఁటుందంటే ఎన్నో ఏళ్లుగా వారి పక్కన ఉన్న సహచరులను కూడా చంపేస్తారు. అవసరమైతే ప్రాణాలను కాపాడిన వారిని కుడా ఉగ్రవాదులు చంపేస్తారు. ఇదే తరహాలో అఫ్ఘనిస్తాన్‌లోని రెండు ఉగ్రవాద గ్రూపుల మధ్య తీవ్ర స్థాయిలో వివాదాలు చెలరేగాయి. ఈ గొడవలో దాదాపు 50 మంది ఉగ్రవాదులు చనిపోయారు. ఘటన ప్రాంతమంతా రక్త సిక్తం అయినట్టు అక్కడి మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి.

అసలు వివరాల్లోకి వెళితే.. అఫ్ఘనిస్తాన్‌లోని షిండాండ్ జిల్లాలోని ఖైఫాన్ ప్రాంతంలో తాలిబన్ సుప్రీం ముల్లా హెబతుల్లా అఖుంద్‌జద మరియు అసమ్మతి తాలిబన్ నేత ముల్లా మొహమ్మద్ రసూల్ వర్గాల మధ్య ఘర్షణ చెలరేగింది. ఈ రెండు వర్గాల నాయకుల మధ్య అంతర్గత విభేదాల వల్లనే ఈ వివాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌లో ఉగ్రవాద ముఖాలు చాలానే ఉన్నాయి. అక్కడి ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఉగ్రవాద స్థావరాలను పూర్తిగా ఆధీనంలోకి తెచ్చుకోలేకపోతోంది. అంతే కాకుండా అక్కడ అమెరికా సైనిక బలగాలు కూడా ప్రత్యేక శిబిరాలని ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు పరిస్థితిని అదుపుచేస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments