“RRR” 2020 లోనే వస్తుందా..రాజమౌళి గారు.?

Friday, March 15th, 2019, 03:00:13 AM IST

దర్శక ధీరుడు రాజమౌళి తన తర్వాత ప్రాజెక్టు పై ఈ రోజు ఒక క్లారిటీ ఇచ్చేసారు.సగం ఊహ సగం నిజాన్ని కలిపితే వచ్చే సినిమాగా “RRR” ఉండబోతుందని రాజమౌళి చెప్పకనే చెప్పేసారు.మాస్ లో అపారమైన క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు రామ్ చరణ్ మరియు ఎన్టీఆర్ లతో బాహుబలి తర్వాత ఇంకో యాగమే చేస్తున్నారని చెప్పాలి.ఇక ఈ ముగ్గురు కలిస్తే ఎలా ఉంటుందో విడుదల సమయంలో మారే బాక్సాఫీస్ లెక్కలే చెప్తాయి.డీవీవీ ఎంటెర్టైన్మెంట్స్ వారు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.ఇప్పటికే ఈ సినిమాపై ఎన్నో అంచనాలు ఉండగా ఆ అంచనాలను ఈ రోజు జరిగిన ప్రెస్ మీట్ మరింత పెంచేసింది.

ఈ ప్రెస్ మీట్ లోనే ఈ సినిమా విడుదల తేదీ పట్ల కూడా ఒక క్లారిటీ ఇచ్చేసారు.ఈ సినిమా వచ్చే ఏడాది 2020 జులై 30 న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది అని చెప్పేసారు.అసలే భారీ ప్రాజెక్ట్ ముందే డేట్ కూడా ఇచ్చేసారు, అందులోను రాజమౌళి,అందుకే ఈ సినిమా విడుదల తేదీ పట్ల ఎక్కడో కొడుతుందని నెటిజన్స్ అంటున్నారు.ఎందుకంటే ఇది వరకే బాహుబలి రెండు సినిమాల విషయంలోనూ రాజమౌళి అనుకున్న సమయానికి సినిమా విడుదల చేయలేదు.

గ్రాఫిక్స్ వర్క్ ఎక్కువగా ఉండడం వలన రాజమౌళి సాధ్యమైనంత వరకు ఉన్నత ప్రమాణాలతో తెరకెక్కించాలనే ఉద్దేశంతో తెరకెక్కించడం వలన అనుకున్న సమయానికి ఆ రెండు సినిమాలు రాలేదు.ఇప్పుడు ఇదే అంశం ఈ సినిమాకి కూడా రిపీట్ అవ్వుద్దా అని సోషల్ మీడియాలో అప్పుడే రచ్చ మొదలయ్యింది.అప్పుడు డార్లింగ్ అభిమానులు ఎదురు చూసారు ఇప్పుడు తారక్ మరియు చరణ్ అభిమానులకు పడిగాపులు తప్పవని సరదాగా ఒకరి అభిమానులు మీద ఒకరు కామెంట్స్ చేసుకుంటున్నారు.మరి జక్కన్న ఈ సినిమాని అయినా అనుకున్న సమయానికి విడుదల చేస్తారో లేదో చూడాలి.