ఢిల్లీ మర్డర్ : 40 లక్షల అప్పుకోసం భార్యనే..క్రైమ్ సినిమా కథలాంటి ప్లానింగ్ ..!

Thursday, October 26th, 2017, 04:26:22 PM IST

గత మూడు రోజుల్లో జరిగిన ఐదు హత్యలతో రాజధాని వాసులు భయంతో బిక్కు బిక్కు మంటున్నారు. ఈ ఐదు హత్యకేసుల్లో ఓ కేసుని పోలీస్ లు చేధించారు. ఢిల్లీ రోహిణి ప్రాంతంలో షాలిమార్ భాగ్ వద్ద మంగళవారం ప్రియా మెహ్రా అనే మహిళ కారులోనే హత్యకు గురైన విషయం తెలిసిందే. తన ప్రాణాలు పోతున్నా 2 ఏళ్ల కొడుకుని కాపాడుకుంది. ప్రియా మెహ్రా హత్యకు కుట్ర పన్నింది ఆమె భర్తే అనే షాకింగ్ నిజాన్ని పోలీస్ లు కనిపెట్టారు. ఓ క్రైమ్ సినిమా కథలా భార్యని మట్టు బెట్టడానికి భర్త పంకజ్ వేసిన పథకానికి పోలీస్ లకే దిమ్మతిరిగింది.

ప్రియా మెహ్రా భర్త కుమారుడితో సహా కారులో ప్రయాణిస్తుండగా ఒకసారిగా వారిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ప్రియాకు మాత్రమే ఎక్కువ బుల్లెట్లు తగిలి మరణించారు. కానీ భర్తకు మాత్రం స్వల్పగాయాలు కావడంతో పోలీస్ లకు అనుమానం వచ్చింది. దీనితో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా రాత్రికి రాత్రే నిజాన్ని కక్కేశాడు.

పంకజ్ స్వతహాగా వ్యాపారి. ఓ వ్యక్తి వద్ద రూ 40 లక్షలు తీసుకుని అది తీర్చడానికి ఆపసోపాలు పడుతున్నాడు. ఈ నేపథ్యంలో అప్పు ఇచ్చిన వ్యక్తి వద్ద నుంచి పంకజ్ కు బెదిరింపులు ఎక్కువయ్యాయి. అప్పు తీర్చకుండా ఎగ్గొట్టడానికి పథకం వేశాడు. ఇందులో భాగంగా భార్య ప్రాణాలనే పావుగా ఉపయోగించుకున్నాడు. కొందరి కిరాయి గుండాలకు డబ్బు ఇచ్చి తన భార్యని హత్య చేయమని చెప్పాడు. ఆ హత్య చేసింది తనకు అప్పు ఇచ్చిన వ్యక్తి అని నమ్మించి కేసు పెట్టాలని భావించాడు. అటాక్ లో భాగంగా తనకు మాత్రం స్వల్ప గాయాలు కావాలని కిరాయి గుండాలకు ముందుగా సూచించాడు. ఆ పథకంలో భాగంగానే వారు ప్రియా పై కాల్పులు జరిపి హత్య చేశారు. ఈ దాడిలో తనపైకి బుల్లెట్లు దూసుకువస్తున్నా కొడుకుని సీటు వెనకాల దాచి ప్రియా ప్రాణాలు వదిలింది.

  •  
  •  
  •  
  •  

Comments