విజయం మాదే, తెలుగు వారి ఓట్లు మాకే : సిద్ద రామయ్య

Friday, May 11th, 2018, 09:00:59 AM IST

ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నేతృత్వంలో గెలిచిన ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ద రామయ్య, రేపు జరగనున్న కర్ణాటక ఎన్నికలపై కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నడుస్తున్న తమ ప్రభుత్వ పాలనను ప్రజలు మెచ్చుకుంటున్నారని, అంతేకాక మళ్లి మా ప్రభుత్వమే రావాలని కోరుకుంటున్నురని ఇటీవల ఒక బహిరంగ సభ వేదికగా ఆయన అన్నారు. ప్రధానిగా వున్న మోడీ వైఫల్యాలను, సమర్ధవంతంగా నిర్వహించలేని ఆయన పాలన పట్ల ప్రజలు నిరాశ, నిస్పృహలతో వున్నారని అన్నారు. బిజెపిని అందుకే ఓటమి భయం వెంటాడుతోందని, అలానే కర్ణాటకలోని తెలుగువారందరూ ఎప్పుడూ కాంగ్రెస్ వైపే ఉంటారని, ఈ సారి కూడా మంచి మెజారిటీతో మేము ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

అయితే సర్వేలు చెపుతున్నట్లు హంగ్ ఏర్పడే అవకాశమే లేదని, అవి వొట్టి ఊహాగానాలేనని ఆయన కొట్టిపారేశారు. ప్రస్తుతం మేము వేసిన అంచనా ప్రకారం మాకు 120కి పైగా సీట్లు వస్తాయి అన్నారు. ఆంధ్రకు ప్రత్యేక హోదా విషయమై మోడీ మాటతప్పారని, తెలుగు వారంతా ఆయనపై కోపంగా వున్నారని, ఈ సారి బిజెపికి గట్టిగా బుద్ధిచెప్పడం ఖాయమని ఆయన అన్నారు. తమ అధినేత రాహుల్ గాంధీ పర్యటనలతో కాంగ్రెస్ క్యాడర్ లో నూతనోతేజాన్ని నింపుతున్నారని, ప్రజలు కూడా తమ పాలన పట్ల నమ్మకంతో వున్నారని, దానికి నిదర్శనంగా మేము ఎక్కడికెళ్లినా వారు మాకు నీరాజనాలు పడుతున్నారని, మేము చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే మాకు శ్రీరామరక్ష అని అన్నారు……..