ఇప్పుడు స్మార్ట్ గ్లాస్సెస్ తో క్రిమినల్స్ డైరెక్ట్ గా పట్టుకోవచ్చట…

Monday, March 12th, 2018, 11:31:10 PM IST

కలియుగం నడుస్తున్నదంతా టెక్నాలజీ తోనే. ఈ రంగంలో వస్తున్న అనేక మార్పులు మనకు ఎన్నో విధాలుగా ఉపయోగపడుతున్నాయి. టెక్నాలజీ రంగంలో రోజు రోజుకీ జరుగుతున్న నూతన ఆవిష్కరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. వీటితో ప్రజల జీవనశైలి వేగంగా మారుతున్నది. అలాగే అన్ని రంగాల్లోనూ టెక్నాలజీ ఫలాలను సాధారణ ప్రజలందరూ అందుకుంటున్నారు. ప్రధానంగా చెప్పాలంటే నేర పరిశోధన రంగంలో టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాలు అన్నీ ఇన్నీ కావు. నేరస్థులను పట్టుకునేందుకు కొత్త కొత్త పద్ధతులు వస్తున్నాయి. నూతన పరికరాలను తయారు చేస్తున్నారు. అందులో భాగంగానే తాజాగా మరో కొత్త సాంకేతిక పరికరం పోలీసులకు అందుబాటులోకి వచ్చింది. దీంతో నేరస్థులను పట్టుకోవడం మరింత తేలిక కానుంది.

గుర్గావ్‌కు చెందిన స్టాక్యూ అనే స్టార్టప్ సంస్థ దేశంలోనే తొలిసారిగా నూతన తరహా స్మార్ట్ గ్లాసెస్ (కళ్లద్దాలు)ను ఆవిష్కరించింది. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ఆధారంగా పనిచేస్తాయి. వీటిని ధరించిన వారు (పోలీసులు) జనావళిలో తిరిగే సమయంలో ఈ గ్లాసెస్ జనాల ముఖాలను స్కాన్ చేస్తాయి. వారిని ఫొటోలు తీస్తాయి. ఆ ఫొటోలను రిమోట్ సర్వర్‌కు పంపిస్తాయి. రిమోట్ సర్వర్‌లోని డేటాబేస్‌లో ఉండే నేరస్థుల ఫొటోలతో ఆ ఫొటోలు మ్యాచ్ అయితే వెంటనే జనాల మధ్యలో ఉన్న గ్లాసెస్ ధరించిన ఆ వ్యక్తికి(పోలీసుకి) సమాచారం వెళ్తుంది. ఇదంతా చాలా తక్కువ సమయంలోనే జరుగుతుంది. ఈ క్రమంలో ఆ వ్యక్తి (పోలీసు) అలర్ట్ అయి జనాల మధ్యలో ఉన్న సదరు అనుమానితున్ని లేదా నిందితున్ని/నేరస్థున్ని అదుపులోకి తీసుకుంటాడు. ఇలా ఈ స్మార్ట్‌గ్లాసెస్ నేరస్థులను సులభంగా పట్టించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.

ముందుగా ఈ గ్లాసెస్‌ను పంజాబ్‌లో పరిశీలించనున్నారు. ఇందుకు గాను ఇప్పటికే ఆ రాష్ట్ర ప్రభుత్వం స్టాక్యూతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ రాష్ట్ర పోలీసులకు ఈ గ్లాసెస్‌ను ఇవ్వనున్నారు. ఈ క్రమంలో పోలీసులు ఈ గ్లాసెస్‌ను వాడి నేరస్థులను సులభంగా పట్టుకోగలుగుతారు. అయితే ఈ స్మార్ట్ గ్లాసెస్‌ను రిమోట్‌గా కూడా ఆపరేట్ చేసేందుకు వీలుంటుంది. ఈ గ్లాసెస్‌లో ఇమేజ్, స్పీచ్ రికగ్నిషన్ సాఫ్ట్‌వేర్‌ను ఏర్పాటు చేశారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా పనిచేస్తూ జనాల మధ్యలో ఉండే క్రిమినల్స్‌ను రియల్‌టైమ్‌లో సులభంగా గుర్తిస్తూ వారిని వేగంగా పట్టిస్తుంది. త్వరలో ఈ గ్లాసెస్‌ను దేశ వ్యాప్తంగా ఆయా రాష్ర్టాల్లో ఉన్న పోలీసులు వాడే అవకాశం ఉంది.

  •  
  •  
  •  
  •  

Comments