ప‌వ‌న్ కళ్యాణ్ జోరు స్టార్ట్ అయ్యిందా.. జ‌న‌సేన‌లోకి ప్రముఖ ఎమ్మెల్యే..?

Thursday, January 10th, 2019, 10:40:11 AM IST

ఏపీలో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రుగ‌నున్న నేప‌ధ్యంలో జ‌న‌సేన ఇప్ప‌టికే మొత్తం 175 స్థానాల్లో పోటీలో దిగ‌నుంద‌ని ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఇప్ప‌టికే అభ్య‌ర్ధుల కోసం వేట ప్రారంభించిన జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎక్కువ శాతం కొత్త వారికే అవ‌కాశం ఇస్తామ‌ని తేల్చేసిన సంగ‌తి తెలిసిందే. ఇక మ‌రోవైపు ఇత‌ర పార్టీల నుండి నాయ‌కుల్ని కూడా పార్టీలోకి చేర్చుకుంటున్నారు. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే నాదేండ్ల మ‌నోహ‌ర్‌తో పాటు మ‌రి కొందురు కీల‌క నేత‌లు జ‌న‌సేన‌లో చేరిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజాగా మ‌రో ముఖ్యనేత జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌ని తెలుస్తోంది. రాజ‌మండ్రి అర్బ‌న్ బీజేపీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ తాజాగా జ‌న‌సేన‌లో చేర‌నున్నార‌ని తెలుస్తోంది. ఇటీవ‌ల ఆయ‌న బీజేపీకి రాజీనామా చేయ‌నున్నార‌ని తెలుస్తోంది. ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్రదేశ్ విభ‌జ‌న జ‌రిగి ఏపీ తీవ్ర‌మైన ఇబ్బందుల్లో ఉన్న‌ నేప‌ధ్యంలో రాష్ట్రానికి బీజేపీ తీవ్ర‌మైన అన్యాయం చేసింద‌ని, రైల్వే జోన్, దుగరాజుపట్నం పోర్ట్, కడప స్టీల్ ప్లాంట్ విషయాల్లో కేంద్రం అన్యాయం చేసిందని అందుకే పార్టీ మారేందుకు సిద్ధ‌మ‌య్యాన‌ని స‌త్య‌నారాయ‌ణ పేర్కొన్నారు. ఇక ఇప్ప‌టికే జ‌న‌సేన నుండి పిలుపు వ‌చ్చింద‌ని, పార్టీలో ఏ ప‌ద‌వి ఇచ్చినా.. తాను సిద్ధ‌మేన‌ని ఆకుల స‌త్య‌నారాయ‌ణ తేల్చేశారు. దీంతో ఎన్నిక‌ల వేళ జ‌న‌సేన‌కు మ‌రింత బ‌లం చేకూరే అవ‌కాశం ఉంద‌ని జ‌న‌సేన శ్రేణులు చ‌ర్చించుకుంటున్నారు.