హోరెత్తిన ప్రత్యేక హోదా పోరు… పోటెత్తిన జనాలు

Saturday, April 7th, 2018, 10:06:55 AM IST

 

ప్రత్యేక హోదా పేరిట ఏపీలో రాజకీయపోరు సాగుతున్నది. అటు హస్తినలో.. ఇటు రాష్ట్రంలో అన్నిపార్టీలు హోదా చదరంగం ఆడుతున్నాయి. పార్లమెంట్ సమావేశాలు ముగిసినప్పటికీ పోరును మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాయి. పైగా శుక్రవారం దీనిని మరింత తీవ్రం చేశాయి. ఏపీ వ్యాప్తంగా నిరసన ర్యాలీలు, సైకిల్ యాత్ర లు, పాదయాత్రలు కొనసాగాయి. పార్టీ అధిష్టానం ముందుగా ప్రకటించిన విధంగా పార్లమెంట్ సమావేశాలు ముగియగానే వైసీపీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు రాజీనామాలు సమర్పించారు. అనంతరం ఢిల్లీలో ఆమరణదీక్షకు దిగారు. వారికి మద్దతుగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఆ పార్టీ నిరసనదీక్షలు చేపట్టింది. పార్లమెంట్ సమావేశాలు ముగిసినప్పటికీ టీడీపీ ఎంపీలు లోక్‌సభలోనే బైఠాయించి నిరసనకు దిగారు. రాష్ట్ర రాజధాని అమరావతిలో ముఖ్యమంత్రి చంద్రబాబు సైకిల్ ర్యాలీలు నిర్వహించారు. మరోవైపు జనసేన అధ్యక్షుడు పవన్‌కల్యాణ్ వామపక్షాలతో కలిసి పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. వీరందరూ ప్రత్యేక హోదా కోసం పోరాటాలు చేస్తుంటే ఏపీ బీజేపీ మాత్రం సీఎం చంద్రబాబుపై విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నది.

వైసీపీ ఆమరణ నిరాహారదీక్ష

ఏపీకి ప్రత్యేక హోదా కోసం మొదట్నుంచి పోరాటం చేస్తున్న వైసీపీ ముందుగా ప్రకటించిన విధంగా పార్లమెంట్ సమావేశాలు నిరవధికంగా వాయిదాపడగానే తన ఎంపీలతో రాజీనామా చేయించింది. శుక్రవారం పార్లమెంట్ ఉభయసభలు వాయిదాపడిన వెంటనే ఆ పార్టీకి చెందిన మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రాద్, మిథున్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, అవినాష్‌రెడ్డి.. స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు రాజీనామాలు సమర్పించారు. అనంతరం వారు ఏపీ భవన్‌లో ఆమరణ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు కేంద్రప్రభుత్వం ఇప్పటికే అనుమతి మంజూరు చేసిన విషయం తెలిసిందే. ఏపీకి ప్రత్యేక హోదా సాధన కోసం ముందుగా చెప్పిన ప్రకారం తమ పార్టీ ఎంపీలు రాజీనామా చేశారని, టీడీపీ ఎంపీలను కూడా రాజీనామా చేయించాలని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి.. సీఎం చంద్రబాబుకు సవాల్ విసిరారు. ప్రత్యేక హోదాపై ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా తమతో కలిసి రావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఎంపీల ఆమరణ దీక్షకు తోడు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలు చేస్తామని జగన్ స్పష్టంచేశారు.

స్పీకర్ చాంబర్ వద్ద టీడీపీ ఎంపీల ఆందోళన

పార్లమెంట్ సమావేశాలు శుక్రవారం నివరధికంగా వాయిదా పడ్డప్పటికీ టీడీపీ ఎంపీలు సభలోనే ఉండి ప్రత్యేక హోదా కోసం నిరసన వ్యక్తంచేశారు. ప్రధాని సీటువద్ద బైఠాయించారు. అయితే వారి తీరును గమనించిన పార్లమెంట్ భద్రతాసిబ్బంది స్పీకర్ రమ్మంటున్నారని చెప్పి టీడీపీ ఎంపీలను సభనుంచి బయటకు తీసుకొచ్చారు. వారు స్పీకర్ కార్యాలయం వైపు వెళ్లగానే భద్రతా సిబ్బంది సమావేశమందిరం తలుపులు మూసేశారు. ఎంపీలు స్పీకర్ చాంబర్ వద్దకు వెళ్లగా అప్పటికే సుమిత్రా మహాజన్ వెళ్లిపోయారు. దీంతో తమను పిలిచి అవమానపర్చారంటూ వారు స్పీకర్ చాంబర్ వద్ద ఆందోళనకు దిగారు. మరోవైపు టీడీపీ ఏపీ వ్యాప్తంగా సైకిల్, మోటార్‌సైకిల్ ర్యాలీలు నిర్వహించింది. సీఎం చంద్రబాబు రాజధాని పరిధి వెంకటపాలెం గ్రామంలోని ఎన్టీఆర్ విగ్రహం నుంచి అసెంబ్లీ వరకు సైకిల్‌యాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన ఏపీ అసెంబ్లీలో మాట్లాడుతూ విభజన సమస్యలపై చర్చించేందుకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలను ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. విజయవాడలో ప్రత్యేక హోదాపై భవిష్యత్ కార్యాచరణ కోసం శనివారం కూడా అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేస్తున్నామని ప్రకటించారు.

వ్యక్తిగత లాభాలకోసం హోదా తాకట్టు: పవన్

ఏపీకి ప్రత్యేక హోదా కోరుతూ జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ శుక్రవారం వామపక్ష నేతలతో కలిసి విజయవాడలోని బెంజ్‌సర్కిల్ నుంచి రామవరప్పాడు రింగ్‌రోడ్డు వరకు పాదయాత్ర నిర్వహించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హక్కుగా దక్కిన హోదాను సాధించడంలో టీడీపీ, వైసీపీలు విఫలం చెందాయన్నారు. ప్యాకేజీ పేరుతో ఇచ్చిన పాచిపోయిన లడ్డూలను చంద్రబాబు చాలా విలువైనవి అని అన్నారని, వ్యక్తిగత లాభాల కోసమే ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారని ఆరోపించారు. టీడీపీకి చిత్తశుద్ది లేదు కాబట్టే అఖిలపక్ష సమావేశానికి తాము వెళ్లడంలేదని స్పష్టంచేశారు.