సమరానికి సర్వం సిద్ధం.. గెలుపెవరిదో?

Thursday, March 26th, 2015, 08:28:22 AM IST


క్రికెట్ ప్రపంచ కప్ -2015లో భాగంగా నేడు సిడ్నీలో జరగబోయే కీలకమైన సెమీ ఫైనల్ మ్యాచ్ లో డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో భారత్ జట్టు బలమైన ఆస్ట్రేలియా జట్టుతో తలపడుతోంది. కాగా ప్రపంచ కప్ మొదలైనప్పటి నుండి వరుస విజయాలతో చెలరేగిపోతున్న భారత్ నేటి మ్యాచ్ లో కూడా గెలుపొందేందుకు రెట్టించిన ఉత్సాహంతో బరిలో దిగుతుండగా, సొంత గడ్డపై తమకెవరు సాటి అనే ధీమాతో ఆస్ట్రేలియా జట్టు సమరానికి సై అంటోంది.

ఇక ఆస్ట్రేలియాలో మ్యాచ్ అంటే సహజంగా పసుపుపచ్చగా మారాల్సిన సిడ్నీ గ్రౌండ్ త్రివర్ణ మయమైంది. కాగా ప్రత్యక్షంగా మ్యాచ్ ను తిలకించేందుకు అమ్ముడైన 42వేల టికెట్లలో 30వేల టికెట్లను భారత్ అభిమానులే దక్కించుకున్నట్లు సమాచారం. ఇక విదేశంలో కూడా టీమిండియాకు పూర్తి మద్దతు లభిస్తుండగా, తమకు మద్దతు తెలిపేందుకు కూడా ఆస్ట్రేలియా క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావాలని ఆసీస్ కెప్టెన్ మైఖేల్ క్లార్ పిలుపునిచ్చారట. ఇక 30వేల టికెట్లు భారత్ అభిమానులే దక్కించుకున్న నేపధ్యంలో క్లార్క్ మాట కాదనలేక ఆస్ట్రేలియా అభిమానులు వచ్చినా స్టేడియం బయటే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ రోజు జరగనున్న క్రికెట్ సమరంలో గెలుపొంది ఫైనల్స్ లో న్యూజిలాండ్ తో తలపడుతున్న జట్టు ఏదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఉత్కంఠతో ఎదురుచూడాల్సిందే.