టీడీపీకి నేడు బ్లాక్ డే.. చంద్ర‌బాబుకు ‘రియాలిటీ’.. రుచి చూపించిన ఆ ఇద్ద‌రు..!

Thursday, February 14th, 2019, 06:44:59 PM IST

ఏపీ ముఖ్య‌మంత్రి టీడీపీ అధినేత చంద్ర‌బాబుకు ఇద్ద‌రు టీడీపీ నేత‌లు రియాలిటీ రుచి చూపించారు. వారిలో ఒక‌రు చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణ‌మోహ‌న్ కాగా, మ‌రొక‌రు అన‌కాప‌ల్లి ఎంపీ అవంతి శ్రీనివాస‌రావు. ఈ ఇద్ద‌రు నేత‌లు రెండు రోజుల గ్యాప్‌లో టీడీపీకి గుడ్‌బై చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే, టీడీపీని వీడి వైసీపీలో చేరిన ఆమంచి చంద్ర‌బాబుకు కౌంట‌ర్ ఇచ్చారు. చంద్ర‌బాబుకు కుల‌పిచ్చి ఎక్కువ‌ని, ఒక సామాజిక వ‌ర్గానికే కొమ్ము కాస్తూ.. మిగ‌తావారిని చుల‌క‌న చేస్తున్నార‌ని, మ‌రోవైపు బాబు సామాజిక వ‌ర్గానికే చెందిన వారు ఎక్కువ‌గా మీడియా అధిప‌తులుగా ఉండ‌డం రాష్ట్రానికి ప‌ట్టిన ద‌రిద్ర‌మ‌ని ఆమంచి మండిప‌డ్డారు.

కుల సేవ చేయ‌డంలో చంద్ర‌బాబును మించిన వారు లేర‌ని, ఆయ‌న‌కు అల్జీమ‌ర్స్ వ‌చ్చిందేమోన‌ని డౌట్‌ను కూడా క్రియేట్ చేశారు ఆమంచి. చంద్ర‌బాబు చుట్టూ కులం, విష‌వ‌ల‌యంలా త‌యారైంద‌ని, అన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల్లో బాబు సామాజిక‌వ‌ర్గానికి చెందిన వారే ఉన్న‌త ప‌ద‌వుల్లో ఉన్నార‌ని, దీనిని ప్ర‌జ‌లు త‌మ‌లాంటి వారు ఎంత మాత్రం స‌హించ‌రని ఆమంచి పోతూ పోతూ గ‌ట్టిగానే విరుచుకుప‌డ్డారు.

ఇక మ‌రోవైపు ఎంపీ అవంతి శ్రీనివాస‌రావు ఈరోజు వైసీపీలో చేరిన త‌ర్వాత‌ చంద్ర‌బాబు పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లే చేశారు. చంద్ర‌బాబా హ‌యాంలో కుల రాజ‌కీయాల‌తో పాటు అవినీతి, నిరంకుశత్వం, బంధుప్రీతి రాజ్యమేలుతోందని అవంతి శ్రీనివాస్ అన్నారు. మొన్న‌టి వ‌ర‌కు కాంగ్రెస్ మోసం చేసింద‌ని చెప్పిన చంద్ర‌బాబు ఇప్పుడేమో బీజేపీ మోసం చేసింద‌ని కాంగ్రెస్ పంచ‌న చేరార‌ని అవంతి అన్నారు.

ప్ర‌త్యేక‌హోదా కోసం వైసీపీ ఎంపీలు రాజీనామా చేసిన‌ప్పుడే టీడీపీ ఎంపీలు కూడా రాజీనామా చేస్తే దేశ‌మంతా మ‌న‌వైపే చూస్తుంద‌ని చెప్పాన‌ని.. అయితే బాబు మాత్రం త‌న మాట విన‌లేద‌ని, ఇప్పుడు ప్ల‌కార్డుల‌తో ధ‌ర్నాలు చేసి ఏం సాధించామ‌ని అవంతి ప్ర‌శ్నించారు. విశాఖ‌ప‌ట్నం రైల్వే జోన్ కోసం తాను పోరాడితే.. చంద్ర‌బాబు త‌న‌పై ఆగ్ర‌హం వ్య‌క్తం చేశార‌ని, ఇలాంటి ముఖ్య‌మంత్రి పై నమ్మ‌కం లేకే పార్టీని వీడాన‌ని అవంతి శ్రీనివాస‌రావు స్ప‌ష్టం చేశారు. ఏది ఏమైనా ఎన్నిక‌ల స‌మ‌యంలో ఈ ఇద్ద‌రు ముఖ్య‌నేత‌లు పార్టీని వీడ‌డం చంద్ర‌బాబుకు పెద్ద దెబ్బే అని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.