కస్టమర్ కు రూ.34వేలు ఫైన్ కట్టిన అమెజాన్!

Tuesday, May 8th, 2018, 10:55:00 AM IST

ప్రముఖ ఆన్ లైన్ వ్యాపార సంస్థ అమెజాన్ నాణ్యమైన వస్తువు అందించని కారణంగా ఒక కస్టమర్ కు ఫైన్ కట్టవలసిన పరిస్థితి ఎదురయింది. విషయంలోకి వెళితే, చెన్నైలోని కొరట్టూరుకు చెందిన మోహిత్ ఆన్ లైన్ లో అమెజాన్ సంస్థ ద్వారా రూ. 8999 విలువచేసే ఒక మొబైల్ కొనుగోలు చేసాడు. అయితే అది కొన్న దగ్గరినుండి పలుమార్లు సరిగ్గా పనిచేయకపోవడంతో మరమ్మత్తులు చేయించాడు. కేవలం మూడు రోజుల్లోనే పూర్తిగా వినియోగించడానికి కూడా వీలులేకుండా పాడయింది. అయితే ఈ విషయమై అమెజాన్ కస్టమర్ వారికి ఫోన్ చేసి తెలుపగా ఫోన్ ను రిటర్న్ తీసుకుని డబ్బులు వాపసు ఇస్తామని చెప్పి మోహిత్ అకౌంట్ నెంబర్ తీసుకున్నారు. కాగా సదరు కస్టమర్ అకౌంట్ లో డబ్బులు వేశామని చెప్పడంతో అతని అకౌంట్ బాలన్స్ బ్యాంకు వారిని అడిగి చెక్ చేయగా నగదు ఏమి జామ కాలేదని తేలింది.

దీనితో బూటకపు మాటలు చెప్పి మోసం చేసిన ఆ సంస్థపై స్థానిక వినియోగదారుల ఫోరంలో మోహిత్ కేసు వేసాడు. ఈ కేసును స్వీకరించిన కోర్ట్ న్యాయమూర్తి జయాబాలన్ పూర్తిగా విచారణ చేసిన అనంతరం, కస్టమర్ మోహిత్ కు మనోవేదన కలిగించినందుకు, అతని కోర్ట్ ఖర్చులకు రూ.25,000 మరియు అతని పాడయిన మొబైల్ ఫోన్ కు రూ.8999 వెరసి మొత్తం రూ.34వేలు తక్షణమే చెల్లించాలని తీర్పు చెప్పింది. ఎవరైనా ఆన్ లైన్ లో ఏదైనా వస్తువు కొనేముందు ఒకసారి ఆలోచించి కొనాలని, కొన్న వస్తువు పాడయితే దాన్ని బాగు చేయించడం, లేదా మరొకటి దాని స్థానంలో ఇవ్వడం వంటివి సంస్థ ఇస్తుందో లేదో తెలుసుకుని కొనాలని టెక్ నిపుణులు సూచిస్తున్నారు…..