సిరియాపై అమెరికా భయంకర మెరుపు దాడులు…

Saturday, April 14th, 2018, 10:15:30 AM IST

గత కొన్నేళ్లుగా అంతర్యుద్ధంతో మసిలిపోతున్న సిరియాలో మరోసారి భయంకర యుద్ధవాతావరణం నెలకొంది. ఇటీవల రసాయన దాడుల్లో వందల మంది పౌరులు చనిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆదేశంతో సిరియాపై మెరుపు దాడులు చేపట్టారు. సిరియా అధ్యక్షుడు బషర్‌ అసద్‌కు వ్యతిరేకంగా అమెరికా దళాలు వైమానిక దాడులకు దిగాయి. ఫ్రాన్స్‌, యూకే దళాలు కూడా అమెరికాతో చేతులు కలిపి సిరియాపై సైనిక దాడులు చేస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం సిరియాలో జరిగిన రసాయన దాడులపై ఆగ్రహంతో, దానికి ప్రతీకార చర్యగా అమెరికా ఈ దాడులు చేస్తోంది. శుక్రవారం రాత్రి నుంచి ఈ దాడులు జరుగుతున్నాయి.

తూర్పు డమాస్కస్‌ ప్రాంతం నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వెలువడుతున్నాయని, పేలుళ్ల ధాటికి ఆ ప్రాంతంతో ఆకాశం నారింజ రంగులో కన్పిస్తోందని ఓ మీడియా ఏజెన్సీ వెల్లడించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయని తెలిపింది. సిరియన్‌ ఎయిర్‌ డిఫెన్స్‌‌, సైంటిఫిక్‌ రీసెర్చ్‌ సెంటర్‌పై రాకెట్లు ప్రయోగించినట్లు తెలుస్తోంది. అసద్‌ రసాయన ఆయుధాలను వాడినందుకు శిక్షగా, మరోసారి రసాయన ఆయుధాలు వాడకుండా ఆపేందుకు సిరియాపై వైమానిక దాడులు చేస్తున్నామని ట్రంప్‌ శుక్రవారం రాత్రి ప్రకటించారు. అంతర్జాతీయంగా నిషేధించిన రసాయన ఆయుధాలు వాడుతూ సొంత ప్రజల ప్రాణాలు తీస్తున్న అసద్‌పై ఒత్తిడి తెచ్చేందుకు అమెరికా సిద్ధమైందని అన్నారు. అయితే సిరియా మాత్రం నిషేధిత ఆయుధాలను తాము వాడలేదని చెప్తోంది.

రసాయన ఆయుధాలను తయారు చేసే, దాచి ఉంచే స్థలాలుగా భావిస్తున్న ప్రాంతాలపై అమెరికా దళాలు ఎక్కువగా దాడులు చేశాయి. ఈ ఏడాదిలో ట్రంప్‌ సిరియాపై దాడులు చేయించడం ఇది రెండోసారి. సిరియాకు సహాయం చేస్తున్న ఇరాన్‌, రష్యాలను కూడా ట్రంప్‌ హెచ్చరించారు. రసాయన దాడులతో ప్రజల ప్రాణాలు తీస్తున్న అసద్‌కు సహాయం చేయడం తగదని ట్రంప్‌ రష్యాకు చీవాట్లు పెట్టారు. డమాస్కస్‌లో బాధ్యతాయుతమైన పాలన తీసుకొచ్చేందుకు తమతో కలిసి రావాలని కోరారు. ఇటీవల ట్రంప్‌ ‘తమ క్షిపణులు వస్తున్నాయి.. రష్యా సిద్ధంగా ఉండాలి’ అంటూ ట్వీట్‌ చేసిన విషయం విదితమే. అసద్‌ ఆయుధ కర్మాగారాలు, దాచి ఉంచిన క్షిపణుల లక్ష్యంగా దాడులు చేయాలని అనుకున్నామని, తమ దాడులు విజయవంతమయ్యాయని బ్రిటన్‌ ప్రధాన మంత్రి థెరిసా మే వెల్లడించారు. పౌరుల మరణాలు సంభవించకుండా ఉండేందుకు వీలైన ఏర్పాట్లు చేశామన్నారు. తాము దాడులను కాకుండా ప్రత్యామ్నాయ మార్గలనే ఇష్టపడతాము.. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో తప్పలేదు అని థెరిసా పేర్కొన్నారు.