హ..హ..హ కుక్క పిల్లలు ఒక్కటవుతున్నాయ్ : అమిత్ షా..

Saturday, April 7th, 2018, 11:52:58 AM IST

ఏపీ ప్రత్యేక హోదా విదాదాలు తారా స్థాయికి చేరుకున్నాయి. ఇదిలా ఉంటే మరో వైపు బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాలను పాములు, కుక్క లు, ముంగీసలు, పిల్లులతో పోల్చారు. 2019 లోక్‌సభ ఎన్నికలకు కౌంట్‌డౌన్ ప్రారంభమైంది. బీజేపీని ఓడించడానికి ప్రతిపక్షాలు కూటమి కట్టడానికి విచిత్ర ప్రయత్నాలు చేస్తున్నాయి. భారీ వరద వస్తే అన్నీ కంటికి కనిపించకుండా కొట్టుకుపోతాయి. కానీ, వటవృక్షం మాత్రమే నిలబడుతుంది. అప్పుడు వరద నీళ్ల నుంచి తమను తాము కాపాడుకోవడానికి పాములు, కుక్కులు, పిల్లులు, ముంగీసలు ఆ చెట్టును ఎక్కుతాయి. అలాగే ప్రధాని మోదీ అనే వరదను ఎదుర్కోవడానికి పిల్లులు, పాములు, కుక్కలు, ముంగీసలు కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో పోటీ చేయడానికి ప్రయత్నిస్తున్నాయి అని పేర్కొన్నారు. టీఆర్‌ఎస్, తృణమూల్ కాంగ్రెస్, టీడీపీ తదితర పార్టీలు మోదీ/బీజేపీ వ్యతిరేక కూటమి నిర్మాణానికి ప్రయత్నిస్తున్న నేపథ్యంలో అమిత్ షా ఈ వ్యాఖ్యలు చేశారు. అనంతరం అమిత్ షా విలేకరులతో మాట్లాడుతూ ప్రతిపక్షాలను జంతువులతో పోల్చాలనేది తన ఉద్దేశం కాదని చెప్పారు.

పాముకు ముంగీసకు అస్సలు పడదు. అలాగే సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ వాదీ పార్టీకి, తృణమూల్ కాంగ్రెస్, కాంగ్రెస్ పార్టీకి, టీడీపీ, కాంగ్రెస్‌కు మధ్య సిద్ధాంతపరమైన విభేదాలున్నాయి. అయినప్పటికీ సిద్ధాంతాలను పట్టించుకోకుండా మోదీని ఓడించడానికి కూటమి దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆయా పార్టీల మధ్య ఉన్న సైద్ధాంతిక తేడాలు, వాటి స్నేహాన్ని పోల్చిచూపడానికే పాములు, కుక్కలు, ముంగీస, పిల్లులను ప్రస్తావించాను అని అమిత్ షా వివరణ ఇచ్చారు. అంతకుముందు ఆయన బీజేపీ 38వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబైలో నిర్వహించిన సభలో మాట్లాడుతూ 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను తొలిగించదని, ఒకవేళ ఎవరైనా తొలిగించాలని ప్రయత్నించినా చూస్తూ ఊరుకోదని తెలిపారు. ఇటీవల ఉత్తర్‌ప్రదేశ్‌లో రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్ కూడా దక్కలేదని చెప్పారు.

కానీ, ఆ పార్టీ అధ్యక్షుడు రాహుల్ మిఠాయిలను పంచారని తెలిపారు. డిపాజిట్ కూడా దక్కకున్నా స్వీట్లు పంచిన నాయకుడిని తాను మొదటిసారి చూస్తున్నానని ఎద్దేవా చేశారు. తాము రెండు లోక్‌సభ స్థానాల్లో ఓడిపోయినప్పటికీ దేశంలో 70శాతం భూభాగంలో బీజేపీ పాలన ఉన్నదని అమిత్ షా తెలిపారు. మోదీ ప్రభుత్వం నాలుగేండ్లలో ఏమీ సాధించిందని ప్రశ్నిస్తున్న రాహుల్.. కాంగ్రెస్ నాలుగు తరాల పాలనలో ఏమీ సాధించారో చెప్పాలని డిమాండ్ చేశారు. బీజేపీ మొదట 10 మంది సభ్యులతో ప్రారంభమైందని, నేడు ప్రపంచంలోనే అతి పెద్ద పార్టీకి అవతరించిందని తెలిపారు. ఈ సభలో మహారాష్ట్రలోని భీడ్ జిల్లాకు చెందిన బీజేపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. దివంగత నేత గోపీనాథ్ ముండే చిత్రపటాలను ఏర్పాటు చేయలేదని నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. దీంతో బీడ్ ఎంపీ, గోపీనాథ్ కుమార్తె ప్రీతం ముండే ఆందోళనకారులను సముదాయించారు. శివసేన బీజేపీతో ఉంటుందని, మిత్రపక్షాల ను వదులుకోబోమన్నారు.