అసలేం చేస్తున్నావ్..? యోగిని నిలదీసిన మోదీ, అమిత్‌షా…

Tuesday, April 10th, 2018, 01:45:34 PM IST

ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో కీలక స్థానాల్లో బీజేపీ దారుణంగా ఓడిపోయింది.. మరో వైపు దళితుల ప్రయోజనాల్ని కాపాడే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరేమీ బాగాలేదని పార్టీకిచెందిన దళిత ఎంపీలే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.. ఈ నేపథ్యంలో ఏమిటి? ఎందుకిలా జరుగుతున్నది?… అని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ను ప్రధానమంత్రి నరేంద్రమోదీతోపాటు, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా నిలదీసినట్లు తెలిసింది. ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమి, యోగి పాలనపై దళిత ఎంపీలు అసంతృప్తితో ఉండడాన్ని అగ్రనాయకత్వం తీవ్రంగా పరిగణిస్తున్నట్లు సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. శనివారం సీఎం యోగి ఢిల్లీకి వచ్చి తనను కలిసినప్పుడు, పలు విషయాల్లో రాష్ట్ర నాయకత్వం వైఫల్యాలపై అమిత్‌షా తీవ్ర అసంతప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పరిస్థితులను స్వయంగా తెలుసుకోవడానికి షా ఈనెల 11న లక్నోకు రానున్నారు. ఆరెస్సెస్ అగ్రశ్రేణి నాయకులు కృష్ణ గోపాల్, దత్తాత్రేయ హొసబలే ఇటీవల మూడు రోజుల పాటు యూపీలో పర్యటించారు. ఇద్దరు యూపీ ఉపముఖ్యమంత్రులు, మంత్రులు, పార్టీ నాయకులు, ఆరెస్సెస్ నాయకులు, క్షేత్రస్థాయి కార్యకర్తలు, ప్రజలతో కూడా భేటీ అయి రాష్ట్రంలో పరిస్థితుల గురించి వారు ఆరా తీశారు. వారు వచ్చిన వెళ్లిన తరువాతనే యోగిని మోదీ, అమిత్‌షా ఢిల్లీకి పిలిపించి సంజాయిషీ కోరడం గమనార్హం. యోగి పనితీరుపై మోదీ, షా అసంతృప్తి వ్యక్తం చేసిన పరిణామాల ప్రభావాన్ని త్వరలో చూస్తామని, యూపీ ప్రభుత్వంలో, బీజేపీ నాయకత్వంలో కీలక మార్పులు జరిగినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని పార్టీ వర్గాలు చెప్తున్నాయి.

రాష్ట్రంలోని ముస్లింలు, దళితులను తమ వైపు తిప్పుకుంటూ ప్రతిపక్ష సమాజ్‌వాది, బహుజన్ సమాజ్‌వాది పార్టీలు బలపడుతున్నాయని ఆరెస్సెస్ ఇప్పటికే బీజేపీ నాయకత్వాన్ని అప్రమత్తం చేసింది. దీంతో మోదీ, షా ఆందోళనల చెంది యోగిని పిలిచి చర్చించారని, త్వరలోనే తాను సమస్యలన్నీ పరిష్కరించి పరిస్థితులను చక్కదిద్దుతానని యోగి వారికి హామీ ఇచ్చారని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటీవల రాష్ట్రంలో దళితులపై దాడులు పెరుగుతున్నాయంటూ యూపీలోని నలుగురు బీజేపీ దళిత ఎంపీలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై బాహటంగానే ఆగ్రహం వ్యక్తం చేయడం, వారిలో కొందరు ప్రధానికి లేఖలు రాయడం సంగతి తెలిసిందే. ఎన్నో ఏండ్లుగా బీజేపీకి కంచుకోటగా ఉన్న, తాను పలుమార్లు ప్రాతినిధ్యం వహించిన గోరఖ్‌పూర్ నియోజకవర్గంలో యోగి ఇటీవల ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించలేకపోయారు. అక్కడ సమాజ్‌వాది పార్టీ విజయం సాధించింది. దీంతో యోగి పలుకుబడికి ఇప్పటికే గట్టి దెబ్బతగిలింది. ఇది జరిగి నెల కూడా గడువక ముందే దళిత ఎంపీల నిరసన, మోదీషా ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరోసారి యోగి సామర్థ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో పరిస్థితులు తమ చేయి దాటి పోకుండా ప్రభుత్వంలో, బీజేపీ నాయకత్వంలో ముఖ్యమైన మార్పులు జరుగవచ్చునన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments