వైసీపీలో సీనియ‌ర్ల హంగామా షురూ

Tuesday, October 23rd, 2018, 08:12:23 AM IST

వైసీపీ నేత‌ల్లో ముఖ్యంగా నెల్లూరు జిల్లా నేత‌ల్లో హంగామా మొద‌లైంది. జిల్లా నేత‌ల్లో కొత్త ఉత్సాహం తొణికిస‌లాడుతోంది. దీనికి కార‌ణం ఇదే జిల్లాకు చెందిన మాజీ మంత్రి మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, మాజీ మంత్రి ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి ఒక్క‌ట‌వ్వ‌డమేన‌న్న మాట వినిపిస్తోంది. ఇటీవ‌ల జ‌రిగిన వైసీపీ నేత‌ల మీటింగ్‌లో ఒకే వేదిక‌పై ఇద్ద‌రూ చేర‌డం వైసీపీ క్యాడ‌ర్‌లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంద‌ట‌. రాష్ట్ర విభజ‌న త‌రువాత కాంగ్రెస్‌ను వీడిన ఆనం టీడీపీ తీర్థం పుచ్చుకున్న విష‌యం తెలిసిందే. అక్క‌డ పొస‌గ‌క‌పోవ‌డంతో వైసీపీకి రావాల‌ని ఆయ‌న చాలా కాలంగా ప్ర‌య‌త్నాలు చేశారు.

అయితే ఆ ప్ర‌య‌త్నాలకు నెల్లూరుకు చెందిన వైసీపీ నేత‌లు మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి, కాటంరెడ్డి శ్రీ‌ధ‌ర్‌రెడ్డి, అనిల్ కుమార్ యాద‌వ్ అడ్డుత‌గల‌డంతో ఆనం వైసీపీలో చేర‌డం ఆల‌స్య‌మ‌వుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల ఆనం సోద‌రుడు ఆనం వివేకానంద‌రెడ్డి చ‌నిపోవ‌డం… రామానారాయ‌ణ‌రెడ్డిని వ్య‌తిరేకించిన వారు మెత్త‌ప‌డ‌టం లాంటి ప‌రిణామాల‌తో ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి వైసీపీలో చేర‌డానికి అడ్డంకులు తొలగిపోయాయి. ఆ త‌రువాత అత‌ను వైసీపీ లీడ‌ర్‌గా మారిపోయిన విష‌యం తెలిసిందే.

ఇక ఇటీవ‌ల ఆనం కార‌ణంగా టీడీపీకి చెందిన ప‌లువురు నాయ‌కులు వైసీపీలో చేరారు. దీనికి సంబంధించిన కార్య‌క్ర‌మంలో ఒకే వేధిక‌ను ఆనం రామ‌నారాయ‌ణ‌రెడ్డి, మేక‌పాటి రాజ‌మోహ‌న్‌రెడ్డి పంచుకోవ‌డంతో నెల్లూరు వైసీపీ నాయ‌కుల్లో నూత‌నోత్సాహం ఉర‌క‌లేస్తోంద‌ని ఆ పార్టీ నాయ‌కులు సంబ‌రాలు చేసుకుంటున్నారు. ఇద్ద‌రు క‌లిస్తే ఎన్నిక‌ల్లో ఇక ఎదురేవుండ‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు భావిస్తున్నారు. ఉప్పు- నిప్పులా ఒక‌రంటే ఒక‌రు చిట‌ప‌ట‌లాడుతూ క‌నిపించే ఆ ఇద్ద‌రూ ఒకే వేదిక‌పై క‌నిపించే స‌రికి `ఆనం- మేక‌పాటి బ్ర‌ద‌ర్స్‌` అంటూ కొత్త ప‌దం పుట్టుకొచ్చింది. ఇక‌నుంచి ఈ ఇద్ద‌రినీ నెల్లూరు పాలిటిక్స్‌లో బ్ర‌ద‌ర్స్‌గా చూడాలేమో?

  •  
  •  
  •  
  •  

Comments