ఆనం బ్రదర్స్ కి చుక్కలు కనిపిస్తున్నాయిగా..!

Friday, January 12th, 2018, 07:40:12 AM IST

నెల్లూరు రాజకీయాల గురించి మాట్లాడుకునేటప్పుడు ఆనం సోదరుల గురించి ప్రత్యేకంగా ప్రస్తావించనవసరం లేదు. అంతలా వారు రాష్ట్ర రాజకీయాలపై ముద్ర వేశారు. కాంగ్రెస్ పార్టీలో ఓ వెలుగు వెలిగిన ఆనం సోదరులు ప్రస్తుతం రాజకీయంగా అంతా యాక్టివ్ గా లేరనే చెప్పాలి. రాష్ట్ర విభజన తరువాత ఆనం బ్రదర్స్ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. కాంగ్రెస్ కు సమీప కాలంలో భవిష్యత్తు లేకపోవడం, జగన్ తో వారికి అంతగా పొసగకపోవడంతో టీడీపీ వైపు మొగ్గారు. పైగా చంద్రబాబు కూడా పలు హామీలు ఇచ్చి ఆనం సోదరులని ఆకర్షించినట్లు తెలుస్తోంది.

ఎమ్మెల్సీ మరియు మంత్రి పదవి ఇస్తానని చంద్రబాబు ఆనం సోదరులకు ఆశ చూపారు. కానీ ఆ తాయిలాల కోసం ఆనం సోదరుల పడిగాపులు మాత్రం తప్పడం లేదు. రాజకీయంగా గడ్డు కాలం నడుస్తుండడంతో చంద్రబాబు పై కూడా ఒత్తిడి పెంచలేకున్నారు. దీనితో ఆనం అనుచరగణం తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే మంత్రి పదవి ఇస్తామని టీడీపీ నుంచి ఎప్పటికప్పుడు సమాచారం అందుతున్నా అది మాత్రం కార్యరూపం దాల్చడం లేదు.

నెల్లూరు జిల్లా నుంచి ఇప్పటికే ఇద్దరు మంత్రులు ఉన్నారు. నారాయణ మొదటి నుంచి మంత్రిగా కొనసాగుతుండగా.. గత ఏడాది జరిగిన మంత్రి వర్గ విస్తరణలో సోమిరెడ్డికి మంత్రి పదవి దక్కింది. నారాయణని మంత్రి వర్గం నుంచి తప్పించి ఆనం రామనారాయణ రెడ్డికి కేబినెట్ లో అవకాశం కల్పిస్తాని జోరుగా ప్రచారం మాత్రం జరుగుతోంది. పదవుల సంగతి పక్కన పెడితే ఆనం సోదరులకు చంద్రబాబు వలన చుక్కలు మాత్రం కనిపిస్తున్నాయని జిల్లా రాజకీయ వర్గాల్లో సెటైర్లు పడుతున్నాయి.

  •  
  •  
  •  
  •  

Comments