యాత్ర యుఫోరియా: అనసూయ ఎమోషనల్ ట్వీట్లు..!

Sunday, February 10th, 2019, 05:00:35 PM IST

దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితం ఆధారంగా ఆయన సీఎం కాకముందు చేసిన పాదయాత్ర కథా వస్తువుగా తీసుకొని దర్శకుడు మహి.వీ. రాఘవ్ రూపొందించిన చిత్రం యాత్ర. ఈ చిత్రం ఈ నెల 8న విడుదలై అటు ప్రేక్షకులు, ఇటు విమర్శకుల ప్రశంసలు అందుకుంటూ బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్లతో ప్రదర్శింపబడుతోంది. ఈ సినిమాలో వైఎస్సాఆర్ పాత్ర చేసిన మలయాళీ సూపర్ స్టార్ మమ్ముట్టికి అశేష ఆదరణ లభిస్తోంది, సినిమా మొత్తం వైఎస్ చూసినట్టే ఉందని, మమ్ముట్టీ ఎక్కడా కనపడలేదని ప్రేక్షకులు అంటున్నారు. వైఎస్ బతికున్నంత కాలం సబితా ఇంద్రా రెడ్డికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు, చేవెళ్ల చెల్లెమ్మగా ఆమెను అంతా పిలిచేవారు. సినిమాలో ఈ పాత్రలో సుహాసిని నటించగా, ఆమె నటనకు ప్రేక్షకుల నుండి మంచి స్పందన లభిస్తోంది.

యాత్ర సినిమాలో ఇంకో ముఖ్యమైన పాత్ర గౌరు చరిత్ర రెడ్డి, ఈ పాత్రలో ప్రముఖ యాంకర్ అనసూయ పోషించారు, ఆమె పాత్రకు కూడా మంచి ఆదరణ లభిస్తోంది. అనసూయ పాత్రకు లభిస్తున్న ఆదరణకు స్పందనగా ఆమె పలు భావోద్వేగభరిత ట్వీట్లు చేసారు, “ఒక లెజెండ్ పాత్ర పోషించిన మరొక లెజెండ్ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుందని, ఈ సినిమాలో మమ్ముట్టి గారిని చూస్తుంటే వైఎస్ బతికున్న రోజులు గుర్తొచ్చాయని, సినిమా చుసిన ఎవరికైనా గుర్తొస్తాయని, వైఎస్ పాత్ర పోషించినందుకు మమ్ముట్టి గారికి కృతజ్ఞతలు” అంటూ ఆయనపై ప్రశంసల వర్షం కురిపించింది. తన పాత్ర గురించి ప్రస్తావిస్తూ “సుచరిత రెడ్డి పాత్ర తన మనసులో చిరకాలం ఉండిపోతుందని, ఈ పాత్ర తాను చేయగలనన్న నమ్మకం ఉంచి తనకు ఈ పాత్ర ఇచ్చినందుకు దర్శకుడు మహి.వీ. రాఘవ్ కు,70ఎంఎం ఎంటర్టైన్మెంట్స్ కు కృతజ్ఞతలు” అంటూ ట్వీట్ చేసింది .