పెట్రోల్ డీజిల్ ధరలకు బాబు రివర్స్ కౌంటర్.. రూ.2 తగ్గింపు!

Monday, September 10th, 2018, 04:31:02 PM IST

ఓ వైపు పెరుగుతున్న పెట్రోల్ డీజిల్ ధరలను అదుపు చేయలేక కేంద్ర ప్రభుత్వంతో పాటు ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చేతులెత్తేశాయి. అయితే ఈ క్రమంలో ఎవరు ఊహించని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు పెరుగుతున్న ధరలకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు. ఇప్పటివరకు పైసల్లో పెరుగుతూ వస్తున్న ధరకు రెండు రూపాయలతో చెక్ పెట్టారు. పెరుగుతున్న ధరల నుంచి రాష్ట్ర ప్రజలకు ఉపశమనం కలిగించే విధంగా ఏపీ ప్రభుత్వం రూ.2లు తగ్గించింది.

ఈ రోజు జరిగిన అసెంబ్లీ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ప్రకటనని జారీ చేశారు. రేపు ఉదయం నుంచే తగ్గించిన ధరలు అమల్లో ఉంటాయని సీఎం తెలిపారు. ఇకపోతే వ్యాట్ తగ్గింపుతో ఏపికి 1120 కోట్ల రూపాయల ఆదాయం తగ్గనుందని ఇలాంటి సమయంలో ప్రజలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని చెప్పారు. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం పన్నులను తగ్గించాలని డిమాండ్ చేస్తూ.. కేంద్ర ప్రభుత్వం చేస్తున్న పొరపాట్లను తప్పులను గురించి వివరించారు. గడిచిన నాలుగేళ్లలో కేంద్ర ప్రభుత్వం చమురు ధరలపై అనుసరిస్తున్న తీరు ప్రజల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తోందని అందులో భాగంగానే నేడు ప్రజల నుంచి బంద్ కి స్పందన వచ్చిందని అన్నారు. ఇక తెలుగు దేశం పార్టీ శ్రేణులు కూడా బంద్ లో పాల్గొని ప్రజల ఆవేదనలో పాలుపంచుకున్నట్లు సీఎం తెలియజేశారు.

  •  
  •  
  •  
  •  

Comments