లండ‌న్ టూర్‌లో ఉన్న జ‌గ‌న్.. వైసీపీలోకి మ‌రో మాజీ కేంద్ర‌మంత్రి..?

Friday, February 22nd, 2019, 09:30:17 AM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వత్రిక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న త‌రుణంలో ప్ర‌తిప‌క్ష వైసీపీ దూసుకుపోతుంది. ఈ క్ర‌మంలో కొద్ది రోజులుగా వైసీపీలో ఇత‌ర పార్టీ నేత‌ల చేరిక‌ల జోరు ఊహించ‌ని విధంగా పెరిగింది.

ముఖ్యంగా అధికార తెలుగుదేశం పార్టీని నుండి వైసీపీలోకి వ‌ల‌స‌లు ఎక్కువ అయ్యాయి. వ‌రుస‌గా టీడీపీ ఎమ్మెల్యేలు ఎంపీలు వైసీపీ తీర్ధం పుచ్చుకోవ‌డంతో పార్టీ శ్రేణుల్లో క‌ల‌వ‌రం మొద‌లైంది.

రాజంపేట ఎమ్మెల్యే మేడా మ‌ల్లికార్జున రెడ్డితో మొద‌లైన జంపింగ్‌లు కొన‌సాగుతూనే ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే ఆమంచి కృష్ణ‌మోహ‌న్, అవంతి శ్రీనివాస‌రావు, పండుల ర‌వీంద్ర, మొద‌గుల వేణుగోపాల్ పార్టీకి గుడ్‌బై చెప్పేశారు.

అంతే కాకుండా మ‌రికొంత మంది టీడీపీ నేత‌లు వైసీపీలోకి జంప్ అయ్యేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు. దీంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబులో టెన్ష‌న్ మొద‌లైంది.

ఇక అస‌లు మ్యాట‌ర్ ఏంటంటే కాంగ్రెస్ నుండి కూడా వైసీపీలోకి వ‌ల‌స‌లు స్టార్ట్ అయ్యాయి. గ‌తంలో మాజీ మంత్రి మ‌హిధ‌ర్ రెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సి రామ‌చంద్ర‌య్య వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే.

ఇక వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి లండ‌న్ టూర్‌కి వెళ్ళ‌క ముందు మ‌రో కేంద్ర‌మాజీ మంత్రి కిల్లి కృపారాణి లోట‌స్ పాండ్‌లో జ‌గ‌న్‌తో భేటీ అయ్యి వైసీపీలో చేరుతున్నాన‌ని ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

అయితే ఇప్పుడు తాజా మ్యాట‌ర్ ఏంటంటే మ‌రో మాజీ కేంద్ర‌మంత్రి వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నార‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో మ‌రో వార్త జోరుగా ప్ర‌చారం అవుతోంది.

కాంగ్రెస్ హ‌యాంలో కేంద్ర మంత్రిగా ప‌ని చేసిన ప‌న‌బాక ల‌క్ష్మీ వైసీపీలో చేరేందుకు.. ఆ పార్టీ ముఖ్య‌నేత‌ల‌తో చ‌ర్చ‌లు జ‌రుపుతున్న‌ట్టు స‌మాచారం. గ‌తంలో ప‌నబాక ల‌క్ష్మీ నెల్లూరు నుండి మూడుసార్లు, బాప‌ట్ల నుండి ఒక‌సారి ఎంపీగా గెలిచిన సంగ‌తి తెలిసిందే.

అయితే గ‌త ఎన్నిక‌ల్లో మ‌రోసారి బాప‌ట్ల నియోజ‌క‌వ‌ర్గంలో కాంగ్రెస్ నుండే పోటీ చేసిన ఆమె ఓట‌మి పాల‌య్యారు. దీంతో పూర్వ‌వైభ‌వం ద‌క్కించుకోవాల‌ని భావిస్తున్నారు ప‌న‌బాక ల‌క్ష్మీ.

ఈ క్ర‌మంలో ప్ర‌స్తుతం రాజ‌కీయ స‌మీక‌ర‌ణాలు మొత్తం వైసీపీకి అనుకూలంగా ఉండ‌డం, కేంద్ర‌మంత్రిగా అనుభం, నియోజ‌క‌వ‌ర్గంలో ఉన్న ఇమేజ్ దృష్ట్యా వైసీపీలో చేరితే గెలుపు సులువు అవుతోంద‌ని భావిస్తున్నార‌ని తెలుస్తోంది.

వైసీపీ ముఖ్య‌నేత‌లు కూడా ఎప్పటి నుంచో ప‌న‌బాక ల‌క్ష్మీని పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. ఎందుకంటే ప‌న‌బాక ఫ్యామిలీకి ఉన్న ఇమేజ్ దృష్ట్యా ఆమెను ఎక్క‌డ నిల‌బెట్టినా గెలుపు ఈజీ అవుతోంది.

ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే చ‌ర్చ‌లు ఓ కొలిక్కి వ‌చ్చాయ‌ని.. టిక్కెట్ ఖారారు అయినా ఏ స్థానం నుండి పోటీ చేయాల‌నే విష‌యం ఫైన‌ల్ కావాల్సి ఉంద‌ని స‌మాచారం. ఈ క్ర‌మంలో జ‌గ‌న్ లండ‌న్ నుండి తిరిగి రాగానే ప‌న‌బాక లక్ష్మీ వైసీపీలో చేర‌డం దాదాపు ఖ‌రారు అయ్యింద‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.