యుపిలో బిజెపికి మరొక సారి భంగపాటు!

Thursday, May 31st, 2018, 05:55:12 PM IST


భారతీయ జనతా పార్టీ ఇప్పటికే మొన్న జరిగిన కర్ణాటక ఎన్నికల్లో మంచి మెజారిటి సాధించినప్పటికీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే. అక్కడ రెండవ స్థానంలో నిలిచిన కాంగ్రెస్, జేడీఎస్ లు కలిసి ఒక సంకీర్ణ ప్రభుత్వంగా ఏర్పడి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసాయి. ఆ విషయం అటుంచితే బిజెపి ప్రస్తుతం దేశంలో కొద్దికొద్దిగా తన ప్రాభవాన్ని కోల్పోతోంది అనడానికి ఆ పార్టీకి రాష్ట్రాల్లో ఎదురవుతున్న పరిస్థితులే అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కాగా నేడు మరోసారి ఆ పార్టీకి యుపిలో భంగపాటు తప్పలేదు. ప్రస్తుతం ఉత్తర్ ప్రదేశ్ లోని కైరానా నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి మృగాంక సింగ్ పై రాష్ట్రీయ లోక్ దళ్ అభ్యర్థి తబస్సుమ్ హాసన్ ఏకంగా 50వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. అయితే ఇదివరకు 2009లో అప్పటి బిజెపి అభ్యర్థిపై ఓటమిపాలైన తబస్సుమ్, ఆ తరువాత 2014లో తన కుమారుడు నహిద్ ను అప్పటి బిజెపి అభ్యర్థి హుకుం సింగ్ కు ప్రత్యర్థిగా నిలబెట్టగా, హుకుం సింగ్ మంచి మెజారిటీతో అక్కడ గెలుపొందారు.

కాగా కొద్దిరోజుల క్రితం హుకుంసింగ్ మరణంతో ఆ లోక్ సభ స్థానం ఖాళి అయి ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగాయి. బిజెపి ఇప్పటికే యూపీలోని గోరఖ్పూర్, పూల్ పూర్ కు జరిగిన ఉపఎన్నికల్లో కూడా ఘోర పరాజయ పొందిన విషయం తెలిసిందే. తన గెలుపుపై తబస్సుమ్ స్పందిస్తూ ఇది నాలుగేళ్ల అబద్దంపై నిజం సాధించిన గొప్ప గెలుపుగా దీన్ని ఆమె అభివర్ణించారు. తనకు సహకరించిన ఇతర పార్టీలైన కాంగ్రెస్, సమాజ్ వాది పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీ, ఆప్, సిపిఐ తదితర పార్టీలన్నింటికీ తన హృదయపూర్వక కృతజ్ఞతలు అని తెలిపారు. ఈవీఎం ల వివాదం పై ఆమె స్పందిస్తూ, రానున్న ఎన్నికల్లో ఇక్కడ ఈవీఎంలతో ఎన్నికలు జరపకూడదని అన్నారు. ఇది ప్రతిపక్ష పార్టీలన్నీ ఉమ్మడిగా సాధించిన ఉమ్మడి విజయం అని కొనియాడారు. కాగా 2014 తర్వాత లోక్ సభకు పోటీ చేసి గెలుపొందిన ఏకైక ముస్లిం మహిళా అభ్యర్థిగా తబస్సుమ్ నిలిచారు……