చంద్ర‌బాబుకు ట్రిపుల్ స్ట్రోక్ : వైసీపీలోకి ఎంపీ అవంతితో పాటు.. మ‌రో టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యే..?

Thursday, February 14th, 2019, 01:50:40 PM IST

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు ముంచుకొస్తున్న త‌రుణంలో అధికార తెలుగుదేశం పార్టీకి వ‌రుస‌గా భారీ షాక్‌లు త‌గులుతున్నాయి. ఇప్పటికే టీడీపీ అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు పై తిరుగ‌బాటు చేసిన టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు.. మేడా మ‌ల్లికార్జున్ రెడ్డి, ఆమంచి కృష్ణ‌మోహ‌న్‌లు.. ఆ పార్టీకి గుడ్‌బై చెప్పేసి వైసీపీలో చేరిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా అన‌కాప‌ల్లి ఎంపీ ఆవంతి శ్రీనివాస‌రావు టీడీపీకి రాజీనామా చేయ‌డం రాజ‌కీయ‌వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

2009లో భీమిలీ నియోజ‌క‌వ‌ర్గంలో ఎమ్మెల్యేగా ప్ర‌జారాజ్యం పార్టీ నుండి గెలిచిన అవంతి, 2014లో టీడీపీ నుండి అనాకాప‌ల్లి పార్ల‌మెంట్ స్థానం నుండి బ‌రిలోకి దిగి గెలిచారు. అయితే ఇప్పుడు మ‌రోసారి ఆయ‌న భీమిలీ నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని భావిస్తుండ‌గా, అందుకు చంద్ర‌బాబు గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌కుండా, గ‌త ఎన్నిక‌ల్లో భీమిలీ నుండి గెలిచిన గంటా శ్రీనివాసరావునే మ‌రోసారి బ‌రిలోకి దించేందుకు చంద్ర‌బాబు ప్లాన్ వేశార‌ని తెలుస్తోంది.

దీంతో అసంతృప్తి చెందిన అవంతి శ్రీనివాస‌రావు, త‌న కార్య‌క‌ర్త‌ల‌తో, అనుచ‌రుల‌తో చ‌ర్చించి, ఈరోజు టీడీపీకి రాజీనామా చేశారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నేడు వైసీపీ అధినేత జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని క‌లువనున్నార‌ని స‌మాచారం. జ‌గ‌న్‌తో చ‌ర్చించిన త‌ర్వాత ఆయ‌న వైసీపీలో చేర‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు. చంద్ర‌బాబుకు ఇంకో షాకింగ్ మ్యాట‌ర్ ఏంటంటే.. అవంతి శ్రీనివాస‌రావుతో పాటు ఉత్త‌రాంధ్ర‌కు చెందిన మ‌రో ఎంపీ, ఎమ్మెల్యే కూడా టీడీపీకి రాజీనామా చేయ‌నున్నార‌ని స‌మాచారం. ఈ ఇద్ద‌రు కూడా అవంతితో పాటు వైసీపీలో చేర‌నున్నార‌ని, దీంతో ఎన్నిక‌ల వేళ చంద్ర‌బాబుకు డ‌బుల్ స్ట్రోక్ త‌గ‌ల‌డం ఖాయ‌మ‌ని రాజ‌కీయ‌వ‌ర్గాల్లో చ‌ర్చించుకుంటున్నారు.