బయటికొస్తున్న మరో కేసు.. కాంగ్రెస్ నేతల్లో గుబులు !

Tuesday, October 2nd, 2018, 01:41:17 PM IST

తెలంగాణలో కాంగ్రెస్ నేతల పరిస్థితి దిన దిన గండంగా తయారైంది. ఈమధ్యే మనుషుల అక్రమ రావాణా చేస్తున్నారంటూ కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డిని అరెస్టవగా ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన రేవంత్ రెడ్డిపై ఐటీ శాఖ దాడులు జరిగి, నెమ్మదిగా ఓటుకు నోటు కేసు కూడ తెరపైకి వస్తున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో మరొక కాంగ్రెస్ లీడర్ పై ఉన్న పాత కేసు వేగం అందుకుంటోంది.

అతనే మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత శ్రీధర్ బాబు. కిషన్ రెడ్డి అనే టిఆర్ఎస్ నాయకుడ్ని గంజాయి కేసులో ఇరికించాలని సుదర్శన్ అనే కాంగ్రెస్ కార్యకర్త శ్రీధర్ బాబు సహాయం కోరాడని. శ్రీధర్ బాబు కూడ సానుకూలంగా స్పందించి ఆయనతో మాట్లాడాడని సుదర్శన్ పోలీసు కేసు పేటి ఇదే శ్రీధర్ బాబు వాయిస్ రికార్డ్ అంటూ ఆధారాలను కూడ ఇచ్చాడు. కేసు నమోదు చేసిన పోలీసులు ఆ వాయిస్ శ్రీధర్ బాబుదేనా కాదా అనే విషయాన్ని నిర్ధారణ చేయడం కోసం వాయిస్ శాంపిల్స్ ను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపారు.

ప్రస్తుతం ఆ కేసును స్పీడప్ చేసిన పోలీసులు ఆ శాంపిల్స్ సంగతేమిటో రిపోర్ట్ ద్వారా తెలపాలని ల్యాబ్ అధికారులను కోరుతున్నారట. శాంపిల్స్ నివేదిక బయటికొచ్చి ఆ సంభాషణ శ్రీధర్ బాబుదేనని తేలితే టీ కాంగ్రెస్ నేతలకు కొత్త తలనొప్పి చుట్టుకున్నట్టే. ఈ తాజా ఉదంతంతో ఎన్నికలు మొదలయ్యే నాటికి ఇంకా ఎన్ని పాత కేసులు బయటకొస్తాయో అని కాంగ్రెస్ నేతలంతా కంగారు పడుతున్నారట.