మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుంది టీ – కాంగ్రెస్ పరిస్థితి..!

Thursday, March 14th, 2019, 06:04:22 PM IST

సార్వత్రిక ఎన్నికల నగారా మోగటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది, పార్టీలన్నీ కత్తులు నూరటం మొదలెట్టాయి. మరో పక్క నాయకులు ఎన్నికల్లో సీటే లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు, ఈ క్రమంలో తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో జత కట్టి ఓటమి పాలై ఉన్న కాస్తంత పరువు కూడా గంగ పాలు చేసుకుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తెరాసకు మద్దతు పలకటంతో తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసారు, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ ఎమ్మెల్యే కందాల ఉపేందర్ రెడ్డి తెరాసలో చేరనున్నట్టు తెలిపారు.

ఇప్పటికే పలువురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెరాసలో చేరగా, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, ఇల్లందు ఎమ్మెల్యే హరిప్రియ నాయక్ లు కూడా తెరాసలో చేరనున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఉపేందర్ రెడ్డి కూడా తెరాసలో చేరనుండటం వల్ల ఖమ్మం జిల్లాల్లో కాస్త బలహీనంగా ఉన్న తెరాసకి బలం చేకూరినట్లవుతుంది. ఇవాళ కేటీఆర్ తో భేటీ అయిన ఉపేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ త్వరలోనే తాను తెరాసలో చేరనున్నట్టు తెలిపారు.