బీజేపీ లోకి మరో కాంగ్రెస్ ఎమ్మెల్యే జంప్

Friday, March 30th, 2018, 01:06:22 AM IST

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దగ్గర కావటంతో జంప్‌ జిలానీల జోరు హోరెత్తింది. ప్రధాన పార్టీలు ప్రత్యర్థి శిబిరాల నుంచి నేతల వలసపై ప్రత్యేక దృష్టి సారించాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే మాలికయ్యా వెంకయ్య గుత్తేదార్‌ పార్టీకి గుడ్‌బై చెప్పి.. బీజేపీ కుర్చీల్లో కూర్చున్నారు. మే 12 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఇది అధికార కాంగ్రెస్‌కు పెద్ద ఎదురుదెబ్బ అవ్వబోతుంది. వెంకయ్య గుత్తేదార్‌ అఫ్జల్‌ పూర్‌ నియోజకవర్గం నుంచి ఆరుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందటం అంటే నిజంగానే విశేషం అని చెప్పుకోవచ్చు. ఓసారి మంత్రి పదవి నిర్వహించారు. సీనియర్‌ నేత అయినప్పటికీ తనను సీఎం సిద్దరాయమ్య గుర్తించకపోవడం, మంత్రిమండలిలో తనను తీసుకోకపోవడంతో కాంగ్రెస్‌ పార్టీపై ఆయన గత కొన్నాళ్లుగా అసంతృప్తితో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాను కాంగ్రెస్‌ను వీడటానికి పార్టీ రాష్ట్ర నాయకత్వమే ముఖ్యమైన కారణమని ఆయన విమర్శించారు.

అయితే గురువారం రోజు ఉదయం బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎస్‌ యడ్యూరప్ప సమక్షంలో వెంకయ్య గుత్తేదార్‌.. కాషాయ కండువా కప్పుకున్నారు. తాను పార్టీకి రాజీనామా చేసేముందు ఆయన సీఎంకు ఫోన్‌లో తన నిర్ణయాన్ని తెలిపారు. యడ్యూరప్ప నాయకత్వంలో పనిచేయాలనే తాను బీజేపీలో చేరినట్టు ఆయన తెలిపారు. దీనిపై ఎవరూ ఎ కాంగ్రెస్ నాయకులూ కూడా ప్రశ్నించకపోవడంతో ఆయనకు కాంగ్రెస్ పై మర్తింత అసహనం కలిగిందని వాపోయారు.