మహాకూటమిలో మరో అంతర్గత యుద్ధం !

Friday, September 28th, 2018, 02:05:40 AM IST

తెలంగాణ మహాకూటమిలో మరొక అంతర్గత యుద్ధం చెలరేగిన సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే టీడీపీ, కాంగ్రెస్, టిజెఎస్, కమ్యూనిస్టుల నడుమ సీట్ల పంపకంలో, అభ్యర్థుల ఎంపికలో పెద్ద వార్ నడుస్తుండగా ఇప్పుడు కూటమిలో ప్రధాన పార్టీ అయిన కాంగ్రెస్ లో మరొక సమస్య మొదలైంది.

సీట్ల పంపకం విషయంలో కొందరు రాహుల్ గాంధీ, సోనియా గాంధీలను తప్పుదోవలోకి తీసుకెళుతున్నారని కొందరు హస్తం నేతలు ఆరోపిస్తున్నారు. నిన్న మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్సీ కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రాష్ట్రంలో తెరాసా పై వ్యతిరేకత బాగా ఉందని, దాన్ని సద్వినియోగం చేసుకుంటే అధికారం మహాకూటమిదేనని చెబుతూ చిన్న చిన్న తప్పులు జరుగుతున్నాయని బాంబు పేల్చారు.

నియోజకవర్గాల్లో గెలిచే సత్తా ఉన్న అభ్యర్థులను,కష్టపడి పనిచేసేవారిని ఎంచుకొంటే మంచిదని హితవు పలుకుతూ కొందరు కాంగ్రెస్ నేతలే అధిష్టానాన్ని మిస్ లీడ్ చేస్తున్నారంటూ ఆరోపించారు. దీన్నిబట్టి కూటమి సీట్ల పంపకంలో లోపల లోపల పైరవీలు తీవ్రంగా జరుగుతున్నాయని, ముఖ్య నేతలు కొందరు అలకలుబూనారని అర్థమవుతోంది. మరి ఈ సమస్యలను కూటమి అధిగమిస్తుందో లేకపోతే బీటలువారుతుందో చూడాలి.