టీకాంగ్రెస్ నుండి మరొక వికెట్ అవుట్ : కారు ఎక్కనున్న సీనియర్ నేత

Monday, June 4th, 2018, 12:06:45 PM IST

తెలంగాణ కాంగ్రెస్ లో ప్రస్తుతం కొన్ని అంతఃకలహాలు బయటపడుతున్నాయి. నిజానికి సీనియర్ టిడిపి నేతలు కొందరు ఇటీవల కాంగ్రెస్ లో చేరికతో ఈ మనస్పర్థలు మరింత పెరిగాయని సమాచారం. ఇప్పటికే రేవంత్ రెడ్డి, నాగం జనార్దన్ రెడ్డి ల చేరికను కొంతమంది సీనియర్ కాంగ్రెస్ నాయకులు విబేధిస్తున్నారని ఇటీవల కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అయితే ప్రస్తుతం నాగం జనార్దన్ రెడ్డి చేరికతో నగర్ కర్నూల్ నియోజక వర్గ ఎమ్ఎల్ సి కూచకుళ్ల దామోదర్ రెడ్డి తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదటి నుండి నగర్ కర్నూల్ లో నాగంకు వ్యతిరేకంగా కాంగ్రెస్ లో పనిచేసిన వ్యక్తిగా దామోదర్ రెడ్డికి పేరుంది. అయితే నాగం చేరిక సమయంలోనే ఆయన కొంత అలకపూనారని, ఇక ప్రస్తుతం ఆయన పార్టీ మారే దిశగా అడుగులు వేస్తున్నట్లు సమాచారం.

మంత్రి డీకే అరుణకు మంచి సన్నిహితుడైన దామోదర్ రెడ్డిని అరుణ, జైపాల్ రెడ్డి, పిసిసి చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి తదితరులు బుజ్జగించారని, అలానే రానున్న ఎన్నికల్లో దామోదర్ రెడ్డి కుమారుడి భవిష్యత్తుకు మంచి బాటలు చూపుతామని హామీ ఇచ్చినప్పటికీ ఆయన అందుకు అంగీకాయించలేదని అంటున్నారు. ఇప్పటికే తన అనుచరగణంతో భవిష్యత్ కార్యాచారణపై పలుమార్లు చర్చలు జరిపిన ఆయన త్వరలో టిఆర్ఎస్ పార్టీలో చేరనున్నారట. ఈ మేరకు పలువురు టిఆర్ఎస్ నాయకులతో కూడా ఆయన మాట్లాడారని అంటున్నారు. దామోదర్ రెడ్డి టిఆర్ఎస్ లో చేరితే కాంగ్రెస్ పార్టీకి ఆ ప్రాంతంలో పెద్ద లోటు ఏర్పడినట్లేనని చెపుతున్నారు. అయితే ఈ మేరకు ఆయన నుండి త్వరలో ఒక ప్రకటన కూడా వెలువడనుందట. ఏది ఏమైనా ఇది ఎంతవరకు నిజమో తెలియాలంటే దామోదర్ రెడ్డి అధికారిక ప్రకటన వెలువరించేవరకు వేచివుండక తప్పదు…….

  •  
  •  
  •  
  •  

Comments