వైసిపిలోకి మరొక టీడీపీ నేత?

Sunday, June 3rd, 2018, 10:50:42 PM IST

ప్రస్తుతం సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో రెండు రాష్ట్రాల్లో ఎన్నికలవేడి అప్పుడే మొదలయింది. అంతేకాక ఆశావహులు కూడా తాము టికెట్ ఆశిస్తున్న పార్టీల వైపు చూస్తున్నారు. ముఖ్యంగా ఆంధ్రాలో రెండు ప్రధాన పార్టీలైన టీడీపీ, వైసిపి ల అభ్యర్థులు జంప్ జిలానీలుగా మారుతున్నారు. ఇప్పటికే దాదాపు 22 మంది వైసిపి ఎమ్యెల్యేలు టిడిపిలో చేరిన విషయం తెలిసందే. అయితే జగన్ ప్రజా సంకల్ప యాత్ర తర్వాత కొందరు టీడీపీ పార్టీవారు కూడా వైసిపిలో చేరుతున్న సంఘటనలు చూస్తున్నాము. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం విశాఖ జిల్లా అనకాపల్లి నియోజకవర్గ ప్రస్తుత ఎంపీ అవంతి శ్రీనివాస్ త్వరలో వైసిపిలో చేరుతున్నట్లు ఊహాగానాలు వెలువడుతున్నాయి.

అంతే కాదు ఆయన ఈ సారి తాను ఎంపీగా కాక, భీమిలి నియోజకవర్గంనుండి ఎమ్యెల్యేగా పోటీ చేసేందుకు చూస్తున్నారట. నిజానికి ప్రస్తుతం టీడీపీ ప్రభావం రోజురోజుకూ తగ్గుతోందని, ఇక రానున్న ఎన్నికల్లో తాను ఎంపీగా పోటీ చేస్తే, తన గెలుపు కొంత అనుమానమే అని భావించిన అవంతి ఈ నిర్ణయం తీసుకున్నారట. ఇదివరకు ప్రజారాజ్యం పార్టీలో వున్న అవంతి శ్రీనివాస్ 2009లో ఆ పార్టీ తరపున భీమిలి నియోజకవర్గం నుండే ఎమ్యెల్యేగా పోటీ చేసి గెలిచారు. కాగా ప్రస్తుతం ఆ నియోజకవర్గానికి టీడీపీ నేత గంట శ్రీనివాస రావు ఎమ్యెల్యేగా వున్నారు. అయితే తాను టీడీపీలో వుండి అక్కడి నుండి పోటీ చేయడం కుదరదు కనుక వైసిపిలో చేరితే తనకు రాజకీయంగా బాగుటుందని,

తన అనుచరులతో ఇటీవల చర్చించిన ఆయన భీమిలిలో ఎమ్యెల్యేగా పోటీ చేసి గెలిస్తే అవకాశం ఉంటే మంత్రి పదవి కూడా చేపట్టవచ్చేనేది ఆయన ఆలోచనట. అయితే మంత్రి గంట సహా కొందరు నేతలు ఆయన్ని టిడిపిలోనే కొనసాగమని బుజ్జగిస్తున్నట్లు, ఆయన మాత్రం అందుకు సుముఖంగా లేరని, రేపో మాపో వైసిపిలో చేరుతారని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి ఈవార్తలో నిజమెంత ఉందొ తెలియాలంటే అవంతి శ్రీనివాస్ తానే స్వయంగా ఆయన తన నోటి వెంట ప్రకటన వెలువడవలసిందే…..