త్వరలోనే తెలంగాణాలో కాంగ్రెస్ వాష్ ఔట్..!

Friday, March 15th, 2019, 03:18:16 PM IST

సార్వత్రిక ఎన్నికల నగారా మోగటంతో తెలుగు రాష్ట్రాల్లో రాజకీయం వేడెక్కింది, పార్టీలన్నీ కత్తులు నూరటం మొదలెట్టాయి. మరో పక్క నాయకులు ఎన్నికల్లో సీటే లక్ష్యంగా పార్టీ ఫిరాయింపులు ముమ్మరం చేశారు, ఈ క్రమంలో తెలంగాణాలో కాంగ్రెస్ పరిస్థితి మరీ దయనీయంగా మారింది. అసలే అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీతో జత కట్టి ఓటమి పాలై ఉన్న కాస్తంత పరువు కూడా గంగ పాలు చేసుకుంది. మొన్న జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్యేలు తెరాసకు మద్దతు పలకటంతో తప్పని పరిస్థితుల్లో ఎమ్మెల్సీ ఎన్నికలు బహిష్కరించాల్సి వచ్చింది. తాజాగా లోక్ సభ ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీని వీడి తెరాసలో చేరనున్నారని సమాచారం అందుతుంది.

ఖమ్మం జిల్లా కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తో భేటీ అయ్యారన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేగింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 19స్థానాల్లో గెలుపొంది ప్రతిపక్ష హోదాలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, రోజుకో నేత పార్టీకి గుడ్ బై చెప్పటంతో ప్రస్తుతం వనమా నిక్షుక్రమణతో లెక్కిస్తే కాంగ్రెస్ బలం 12కు చేరుతుంది. దీన్ని బత్తిన చూస్తే లోక్ సభ ఎన్నికల లోపే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష హోదా కోల్పోవటం ఖాయంగా కనిపిస్తుంది.