టిడిపి మరొక వికెట్ డౌన్!

Friday, April 13th, 2018, 11:14:00 PM IST

సార్వత్రిక ఎన్నిలకల సమయం దగ్గరపడుతున్నకొద్దీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఎన్నికల వేళ కావడంతో ఒక పార్టీనుండి మరొక పార్టీకి ఆశావహులు మారుతూ ఉండడం సహజం. ఆ విధంగా చూస్తే ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ అధినేత ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు షాక్ తగిలింది, ఇంకా చెప్పాలంటే ఆ పార్టీకి పెద్ద ఎదురుదెబ్బే తగిలింది. కృష్ణా జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. టీడీపీలో గౌరవం, సరైన ప్రాధాన్యత దక్కకపోవడంతోనే పార్టీ మారుతున్నట్లు యలమంచలి రవి ప్రకటించారు.

ఈ నెల 14న ప్రజా సంకల్ప యాత్ర కృష్ణా జిల్లాలోకి ప్రవేశించే సమయంలో వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు ఆయన వెల్లడించారు. తాజాగా రవి మీడియాతో మాట్లాడుతూ టీడీపీ మంత్రులు తనను కించపరిచే విధంగా మాట్లాడారని ఆవేదన వ్యక్తం చేశారు. మాకు సీటు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు మోసం చేశారని రవి మండిపడ్డారు. టీడీపీ 2014 ఎన్నికల్లో విజయవాడ ఈస్ట్ టికెట్ ఇస్తానని నమ్మించి మోసం చేసిందని వచ్చే ఎన్నికల్లో కూడా ఇస్తారన్న నమ్మకం లేదన్నారు. సీఎం ని కలిసినా ఆయన మాటలపై నమ్మకం కలగలేదని అన్నారు.

నాలుగేళ్లుగా పార్టీలో నన్ను మభ్యపెడుతూనే ఉన్నారని పార్టీలో ఎలాంటి ప్రాధాన్యత ఇవ్వలేదని ఆయన వాపోయారు. వైఎస్ జగన్ మాటకు కట్టుబడే వ్యక్తి అని రవి పేర్కొన్నారు. ప్రత్యేక హోదా విషయంలో సీఎం యూటర్న్ లు బాధకలిగించాయన్న యలమంచిలి రవి సీఎం మాట మార్చే విధానం వల్ల ప్రజల్లో గందరగోళం నెలకొందన్నారు. వైసీపీలో చేరడం ఆనందంగా ఉందని పార్టీ బలోపేతం కోసం అందరితో కలిసి పనిచేస్తానని ఆయన తెలిపారు. జగన్ పాదయాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వస్తుందని హోదాపై జగన్ నిర్ణయం ఉద్యమం పటిష్టంగా ఉందని హోదా విషయంలో జగన్ పోరాటాన్ని ప్రజలు ముఖ్యంగా యువత నమ్ముతున్నారన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసిపికి అనూహ్యవిజయంతో పట్టం కడతారని ఆయన జోస్యం చెప్పారు…