ఏఎంబి సినిమాస్ లో అంతరిక్షం

Thursday, December 6th, 2018, 03:30:12 PM IST

వరుస చిత్రాలు చేసుకుంటూ జోరుమీదున్నాడు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్. తాజాగా వరుణ్ నటించిన చిత్రం అంతరిక్షం. ఈ చిత్రానికి సంకల్ప్ రెడ్డి దర్శకుడు. ఇప్పటికే ఘాజి చిత్రం తో తన సత్తా ఏంటో నిరూపించుకున్నాడు దర్శకుడు. రెగ్యులర్ కమర్షియల్ చిత్రాలకు దూరంగా ప్రయోగాత్మక కథలు ఎంచుకుని తీసిన ఘాజి చిత్రం అందరిని ఆకట్టుకుంది. ఈ సారి అంతరిక్ష పరిశోధన అంశాలతో ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించే ప్రయత్నం చేస్తున్నాడు దర్శకుడు. అందుకే అంతరిక్షం చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్ ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఈ చిత్రం లో వరుణ్ తేజ్ సరసన లావణ్య త్రిపాఠి, అదితి రావులు హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరుణ్ తేజ్, అదితి రావు లు ఇద్దరు వ్యోమగాములుగా కనిపిస్తారు. అంతరిక్షం చిత్రం త్వరలో విడుదల కానుండడంతో, చిత్ర ప్రచార కార్యక్రమాలు కూడా జోరుగానే సాగుతున్నాయి. స్పేస్ లో వరుణ్ తేజ్ చేసే విన్యాసాలని చూడడానికి అభిమానులు ఎంతగానో ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు. ఇది వరకే విడుదలైన టీజర్ ఆ ఉత్కంఠని మరింతగా పెంచింది.

ఈ చిత్రానికి సంబందించిన థియేట్రికల్ ట్రైలర్ ని డిసెంబర్ 9న లాంచ్ చేయబోతున్నట్లు ఇదివరకే ప్రకటించారు. ఈ కార్యక్రమాన్ని విభిన్నంగా నిర్వహించబోతున్నలు వార్తలు వస్తున్నాయి. సూపర్ స్టార్ మహేష్ బాబు భాగస్వామిగా ఉన్న ఏఎంబి సినిమాస్ మల్టిప్లెక్స్ ఇటీవలే ఘనంగా ప్రారంభమైన సంగతి తెలిసిందే. అలాగే అద్భుతమైన విజువల్స్ తో అంతరిక్షం చిత్రాన్ని రూపొందిస్తున్నారు చిత్ర యూనిట్. అందుకోసమనే అంతరిక్షం చిత్ర ట్రైలర్ ని అత్యాధునిక హంగులు, ఎఫెక్ట్స్ బావుండే థియేటర్ లో ట్రైలర్ లాంచ్ చేస్తే బావుంటుంది అనే ఉద్దేశంతో, ట్రైలర్ ని ఏఎంబి సినిమాస్ లో లాంచ్ చేయడానికి సిద్ధపడ్డారు.

  • 4
  •  
  •  
  •  

Comments