వ్యూహాలతో సిద్ధమైన రాజకీయ పక్షాలు

Sunday, June 9th, 2013, 07:42:36 PM IST

అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలను రాజకీయపార్టీలు ఇప్పటికే సిద్ధం చేసుకున్నాయి. తెలంగాణ అంశంతో టీఆర్ఎస్, ప్రజాసమస్యలతో వైసీపీ ప్రభుత్వాన్ని ఎండగట్టాలనుకుంటున్నాయి. ప్రతిపక్షాలని ధీటుగా ఎదుర్కొనేందుకు అధికార పార్టీ కసరత్తులు చేస్తోంది.

సోమవారం నుంచి జరగనున్న సమావేశాల్లో పాలక పక్షాన్ని ఎండగట్టడానికి ప్రతిపక్ష పార్టీలు సన్నద్ధమయ్యాయి. గత కొన్నేళ్లుగా ప్రతి అసెంబ్లీ సమావేశాల్లోనూ తెలంగాణ తీర్మానం కోసం పట్టుబడుతున్న టీఆర్ఎస్ ఈ సమావేశాల్లో కూడా తమ వాణి వినిపించబోతోంది. తెలంగాణ అంశంపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టాల్సిందిగా ఆ పార్టీ నేతలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు తెలంగాణ జేఏసీ తలపెట్టిన ఛలో అసెంబ్లీ కార్యక్రమానికి అనుమతి కోసం ప్రభుత్వాన్ని నిలదీస్తామన్నారు ఆ పార్టీ నేత ఈటెల రాజేందర్.

అసెంబ్లీ సమావేశాల్లో ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని నిర్ణయించుకుంది వైసీపీ. విద్యుత్ ఛార్జీలు, కరెంటు కోతలు, పరిశ్రమలకు కోతలపై సర్కార్ ని ప్రశ్నిస్తామంటున్నారు ఆ పార్టీ నేతలు. రైతులకు రుణాలు మంజూరు, విత్తన సరఫరా అంశాలను సభలో ప్రస్తావిస్తామన్నారు. అమ్మహస్తం పథకం పంపిణీలో అక్రమాలు, పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లలో అధికార కాంగ్రెస్ అక్రమాలు ఎండగడతామని చెప్పారు. ప్రాణహిత, పోలవరం ప్రాజెక్టులకు జాతీయహోదా కల్పించాలని వైసీపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది.

తెలంగాణ వాదన్ని మోస్తున్న బీజేపీ కూడా ఈ సమావేశాల్లో తెలంగాణపై తీర్మానానికి పట్టుబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక లెఫ్ట్ పార్టీలు ప్రజాసమస్యలపై ప్రభుత్వాన్ని కడిగేయాలని నిర్ణయించుకున్నాయి. అటు అధికార పార్టీ కూడా విపక్షాలని ధీటుగా ఎదుర్కోవడానికి వ్యూహం రచిస్తోంది.