కేంద్ర వైఖరితో తలలు పట్టుకుంటున్న ఏపీ బీజేపీ నేతలు?

Tuesday, July 31st, 2018, 12:59:15 AM IST

ఇదివరకటి ఎన్నికల సమయంలో ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మరియు విభజన హామీల విషయంలో కేంద్ర బీజేపీ, టీడీపీతో పొత్తుపెట్టుకుని వాటిని తీర్చడంలో మాత్రం పూర్తిగా విఫలం అయిందని టీడీపీ సహా పలు పార్టీలు నిరసన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. తదనంతరం ఎన్డీయే నుండి బయటకు వచ్చిన టిడిపి, ఇటీవల బీజేపీ పై అవిశ్వాస తీర్మానం కూడా ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. అయితే కావలసినంతమంది సభ్యుల మద్దతు లేక అది వీగిపోవడం జరిగింది. ఇకపోతే ప్రస్తుతం ఏపీలో బీజేపీ నేతల పరిస్థితి మరింత దయనీయంగా ఉందని సమాచారం. కేంద్రంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా హోదా వంటి ముఖ్య హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజలలోకి వెళ్లి గట్టిగా తమ పార్టీ గురించి చెప్పలేని పరిస్థితి ఎదురవుతోంది అనేది ఆ పార్టీలోని కొందరు నాయకుల ఆవేదన.

ఇక రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా మాజీ కాంగ్రెస్ నేత కన్నా లక్ష్మి నారాయణ పదవిని చేపట్టిన తరువాత పార్టీని ఎలాగైనా ఏపీలో బలోపేతం చేయాలనే తలంపుతో ఆయన రాష్ట్ర యాత్ర ప్రారంభించినప్పటికీ కూడా పెద్దగా ఉపయోగం ఏది కనపడడంలేదని అంటున్నారు. ఇక ఎన్నికలకు ఒకవైపు సమయం దగ్గర పడడం, ఇప్పటికీ కూడా అసలు ఒంటరిగా పోటీ చేయాలా లేక, ఏదైనా పార్టీతో పొత్తు ఉంటుందా అనే దానిపై కూడా స్పష్టత లేకపోవడం ఒక సమస్య. ఇక కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థుల ఎంపిక కూడా ప్రశ్నార్ధకంగా మారుతోందని వార్తలు వస్తున్నాయి. అయితే ఎలాగైనా రాబోయే ఎన్నికలపై గట్టిగా దృష్టిపెట్టాలని, ఏపీలో ప్రజలు తమను నమ్మేవిధంగా పక్కా ప్రణాళికలు రచించాలని కొందరు సీనియర్ నేతలకు కేంద్రం నుండి ఇప్పటికే ఆదేశాలు అందాయని వినికిడి.

వాస్తవానికి రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యకమాల్లో కేంద్రం వాటా కూడా ఉన్నప్పటికీ దానిని బహిరంగపరిచి టీపీడీతో కలిసి వెళ్లి మా పార్టీ భాగస్వామ్యంకూడా ఇందులో వుంది అని ప్రజలకు వివరాయించడానికి బీజేపీ నేతలు ఎవరు కూడా ముందుకురాలేకపోతున్నారని, పురంధేశ్వరి, కృష్ణం రాజు, హరిబాబు, విష్ణు కుమార్ రాజులూ సైతం ఇదివరకటికంటే ఏపీలో పార్టీ పరిస్థితి విషయమై కొంత డైలమాలో పడ్డట్లు సమాచారం. ఇక ఇదంతా చూస్తుంటే బీజేపీ పరిస్థితి ఏపీలో చాలా రోజురోజుకు చాలా గడ్డుగా తయారౌవుతోందని, ఇకనైనా రాష్ట్రనేతలు గట్టిగా చొరవ తీసుకుని ప్రజల్లోకి వెళ్లకపోతే రాబోయే ఎన్నికల్లో పార్టీకి జరిగే నష్టం ఎక్కువే ఉంటుందని, రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు……

  •  
  •  
  •  
  •  

Comments